ఈ దాడి నాపై కాదు..రాష్ట్రంపై
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న తనపై ఇష్టానుసారం పై మాట్లాడుతున్నారని..ఇది వ్యక్తిగతంగా జగన్ పై జరుగుతున్నది కాదని..రాష్ట్రంపై జరుగుతున్నది అని అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ లేవని కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేరాల్లో కొత్త కోణం కనిపిస్తోంది. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.. ఆలయాల రథాలను తగలబెట్టారు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు.. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకున్నారు. చివరకు ముఖ్యమంత్రిని కూడా దారుణమైన బూతులు తిడుతున్నారు.
ఇది కరెక్టేనా.. ఇలా తిట్టడం కరెక్టేనా.. ఆలోచించండి. సీఎంను అభిమానించే వాళ్లు తిరగబడాలి.. తద్వారా గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు. ఇది అనైతికం.. అధర్మం'' అన్నారు. 'పథకం ప్రకారం.. అక్కసుతో రాష్ట్రం పరువు తీస్తున్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూడటం సమంజసమేనా. అధికార పార్టీ పాలన మెచ్చుకుంటూ ప్రజలు అన్ని ఎన్నికల్లో గెలిపించారు. తనవాడు గెలవలేదని రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటూ రాష్ట్రంలో నేరాలు చేసేందుకు యత్నిస్తున్నారు. 'రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అతి ముఖ్యమైన విషయం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పోలీసులు ఎక్కడా రాజీ పడొద్దు. తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దు. చట్టం ముందు నిలబెట్టండి. మహిళలు, చిన్నపిల్లలు, బడుగు, బలహీన వర్గాల విషయంలో రాజీ పడొద్దు. రాజకీయ నేతల్లో కూడా అసాంఘిక శక్తులను చూస్తున్నాం. అలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దు'' అని సీఎం జగన్ సూచించారు.