సినిమా టిక్కెట్ల వ్యవహారంపై జగన్ కీలక వ్యాఖ్యలు
రేట్ల తగ్గింపును వ్యతిరేకించే వారు పేదల వ్యతిరేకులే
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలిసారి సినిమా టిక్కెట్ల వ్యవహారంపై బహిరంగంగా స్పందించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి మంచి పనిని కొంత మంది విమర్శిస్తున్నారని అంటూ సినిమా టిక్కెట్ల అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. 'విమర్శలు చేసే వారు చివరకు అందుబాటు ధరలో వినోదాన్ని అందించాలని సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తే ఆ నిర్ణయంపై కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి వాళ్లు పేదల గురించి ఆలోచన చేసే వాళ్ళేనా. ఇటువంటి వారు పేదల గురించి పట్టించుకునే వారేనా?.ఇటు వంటి వారు అంతా పేదల వ్యతిరేకులు.పేదవాళ్ళకు వీళ్లు శత్రువులు కాదా అని అందరూ ఆలోచించాలి' అంటూ వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నూతన సంవత్సర సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్‌పైనే చేశానన్నారు. 'పెన్షన్ .2,250 రూపాయల నుంచి .2,500 రూపాయలకు పెంచాం. సంక్షేమ పాలన వైపు అడుగులు వేస్తున్నాం. ఎవరైనా మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నా.. మంచి చేస్తుంటే విమర్శించే వాళ్లు ఉన్నారు.
నిరుపేదల కష్టాలు వారికి తెలుసా..? విమర్శించే వాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించడం లేదా?. ఆర్థిక ఆధారం లేక అల్లాడుతున్న వృత్తులు చాలా ఉన్నాయి. అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. 62 లక్షల మంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కేవలం 36 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చేది. మేం 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈనెలలోనే కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం పెన్షన్ కోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వైసీపీ ప్రభుత్వం పెన్షన్ కోసం నెలకు 1450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వంలాగా పెన్షన్‌లో కోత లేదు. కుల,మతం, రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తున్నాం. అర్హులందరికీ పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నాం. పడిగాపులు లేకుండా ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. లబ్ధిదారులకు ఇబ్బంది ఏర్పడితే వాలంటీర్లను కలవాలి. అభివృద్ధి గురించి ఆలోచించని పార్టీలు విమర్శిస్తున్నాయి. కోర్టులకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు.