ఇన్ని బటన్లు నొక్కాం..175 సీట్లు ఎందుకు రాకూడదు
సీఎం సూపర్...కొంత మంది ఎమ్మెల్యేలు వీక్
జగన్ తో బేటీ అనంతరం కొడాలి నాని
ఏపీలో అధికార వైసీపీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు కొత్తగా నియమించిన ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా ప్రెసిడెంట్లు.మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. వచ్చే రెండేళ్ళలో పార్టీపరంగా చేపట్టాల్సిన చర్యలు...ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి ఎలా బలంగా తీసుకెళ్ళాల్సిన అవసరాన్ని వెల్లడించారు. మే 2 నుంచి ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం జగన్ కూడా త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నట్లు ఈ సమావేశంలో వెల్లడించారు. ఎవరూ కూడా పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా కాదని వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ మేనిఫెస్టోను 95 శాతం అమలు చేసి..అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్ళటం చాలా అరుదైన అంశం అని సీఎం జగన్ పేర్కొన్నారు. జగన్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వేల్లో సీఎం జగన్ కు 65 శాతం వరకూ అనుకూలంగా ఫలితాలు రాగా..కొన్ని చోట్ల మాత్రం ఎమ్మెల్యేలకు తక్కువగా ఫలితాలు వచ్చాయన్నారు. వారికి వైఖరి మార్చుకునేందుకు ఒకసారి ఛాన్స్ ఇచ్చారని..గెలిచే ఛాన్స్ లేకపోతే సిట్టింగ్ లకు కూడా సీట్లు దక్కవని కొడాలి నాని స్పష్టం చేశారు. ఏ పార్టీ నాయకుడు కూడా ఓడిపోయే వారికి సీట్లు ఇవ్వాలనుకోరని అన్నారు.
మంత్రుల కంటే జిల్లా ప్రెసిడెంట్లు, ప్రాంతీయ సమన్వయకర్తలే కీలకం అన్నారు. ఎవరికైనా పార్టీయే సుప్రీం అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. జిల్లా ప్రెసిడెంట్లుగా ఉన్న వారు అభ్యర్ధులను గెలిపించుకుని వస్తే వాళ్లు మంత్రులుగా తిరిగి వస్తారన్నారు. సరైన సమయంలో పార్టీపై ధ్యాస పెట్టాలి కాబట్టి..పెడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే నెలకు పది సచివాలయాలు తిరగాలని జగన్ తేల్చిచెప్పారు. జిల్లా ప్రెసిడెంట్లు..ప్రాంతీయ సమన్వయ కర్తలు పరిశీలించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపించాలి..గెలవాలని అని నేతలకు సూచించారు. మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతో కాదని..ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో అన్నారు. మనం పోయి చంద్రబాబు రావాలన్నదే వారి అజెండా అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తారన్నారు. దుష్టచతుష్టం అని బ్రాండింగ్ మొదలుపెట్టాం...మీరు కూడా ఆ పని చేయాలి అని సూచించారు. ఇన్ని బటన్లు నొక్కి ..రెండున్నర లక్ష కోట్లు ప్రజలకు ఇచ్చి కూడా ఇంకా గెలవమా అని ప్రశ్నించారు. 151 కాదు..175 ఎందుకు రాకూడదు అని జగన్ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కుప్పం గెలవలేదు. ఈ సారి ఎందుకు రాకూడదు అని ప్రశ్నించారు.