Telugu Gateway
Andhra Pradesh

రాష్ట్రాలకు వ్యాక్సిన్ల అమ్మకం కూడా కేంద్రం ఆదేశాల మేరకే

రాష్ట్రాలకు వ్యాక్సిన్ల అమ్మకం కూడా కేంద్రం ఆదేశాల మేరకే
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాక్సినేషన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ల కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశాన్ని పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జగన్ సోమవారం నాడు కరోనాకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా ప్రజలకు స్పష్టంగా చెప్పాలన్నారు. 'వ్యాక్సినేషన్‌ అనేది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంది. రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలనుకున్నా, ఎన్ని అమ్మాలో కేంద్రమే కంపెనీలకు నిర్దేశిస్తోంది. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు అమ్మాలనే విషయాన్ని కేంద్రమే నిర్ణయిస్తోంది. కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అది కూడా డబ్బును ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తి, వాటి లభ్యత అనేవి రాష్ట్రం పరిధిలోని అంశాలు కావని, ఇవి కేంద్రం నియంత్రణలో ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు.' అని వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థలో ఉన్న కొందరు వ్యక్తులు, ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. నెలకు కోటి వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా అయ్యే పరిస్థితి భవిష్యత్తులో ఉంటే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు కనీసం 6 నెలలు పడుతోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రస్తుతం సగటున నెలకు 19 లక్షలకు పైగా డోసులు మాత్రమే వస్తున్నాయన్నారు. ''వ్యాక్సిన్‌ సెంటర్ల వద్ద, రద్దీ, తోపులాట పరిస్థితులు కనిపించకూడదు. వ్యాక్సిన్‌ ఎవరికి వేస్తారన్నదానిపై ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు స్పష్టంగా చెప్పాలి.

దీనివల్ల వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద క్యూలు ఉండే పరిస్థితిని నివారించవచ్చు. వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద కుర్చీలు ఏర్పాటు చేసి, టీకా తీసుకునేవారికి సౌకర్యంగా ఉండేలా చూడాలి. అందిరికీ వ్యాక్సిన్‌ అందుతుందని, ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. 45 ఏళ్లకు పైబడి మొదటి డోస్‌ తీసుకుని, రెండో డోస్‌ కోసం వేచి చూస్తున్న వారికి వెంటనే వ్యాక్సిన్‌ అందించేలా చూడాలి. 45 ఏళ్ల పైబడ్డ వారిపై కోవిడ్‌ ప్రభావం అధికంగా ఉన్నందున ముందు ఈ కేటగిరిలో ఉన్న వారిపై దృష్టిపెట్టాలి. జ్వరం వస్తే దాన్ని కోవిడ్‌ లక్షణంగా చూసి, వెంటనే మందులు ఇచ్చేలా చూడాలని, వైద్య నిపుణులు ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని'' సీఎం ఆదేశించారు.

Next Story
Share it