Telugu Gateway
Andhra Pradesh

చిరు టార్గెట్ జగనేనా?!

చిరు టార్గెట్ జగనేనా?!
X

మెగా స్టార్ చిరంజీవి టార్గెట్ ఎవరు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పదే పదే విమర్శలు చేస్తున్నది వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..అయన కాబినెట్ లోని మంత్రులే. గతంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు అంటూ విమర్శించిన సీఎం జగన్ ఇప్పుడు కొత్తగా ఆ భార్య కాకపోతే మరో భార్య అంటూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. జనసేన టీడీపీ తో కలిసే అవకాశం ఉండనే వార్తలు వస్తున్న తరుణంలో జగన్ వ్యక్తిగత దాడి పెంచినట్లు కనిపిస్తోంది. ఒక్క జగన్ కాదు...అయన కాబినెట్ లోని మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. చివరకు ఆహా ఓటిటి లో సీనియర్ హీరో బాల కృష్ణ నిర్వహించే అన్ స్టాపబుల్ కు హాజరు కావటంపై కూడా మంత్రులు, మాజీ మంత్రులు ఎటాక్ చేశారు. ఈ తరుణంలో చిరంజీవి చేసిన వ్యాఖలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలనే మురికి కూపంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో కొంత మురికి తనకు కూడా అంటుకుంటుంది. మురికిని తీసేవాళ్లకు మురికి అంటడం సహజమే కదా అంటూ స్పందించారు. ఒక స్వచ్ఛమైన ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం సహకరించాలి.. ప్రొత్సహించాలి.

అయితే మితిమీరి పవన్ ను అనరాని మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుంది. పైగా పవన్‌ను తిట్టినవాళ్లు మళ్లీ నా దగ్గరకు వచ్చి పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తారు. రమ్మని బతిమాలతారు. 'నా తమ్ముడిని అన్ని మాటలు అన్నవాళ్లతో మళ్లీ మాట్లాడాల్సి వస్తోందే.. వాళ్లను కలవాల్సి వస్తుంది అంటూ సంచలన వ్యాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ కు కించిత్‌ స్వార్థం కూడా లేదు...డబ్బు యావ లేదు. పదవీ కాంక్ష లేదు. తన కోసం ఎప్పుడూ ఆలోచించుకోడు. నేను ఒక అన్నగా చెప్పడంలేదు. తనని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నా. అంతెందుకు.. మొన్నటిదాకా వాడికి సొంత ఇల్లు లేదు. మా అందరికీ ఉన్నాయి.. నువ్వు కూడా కట్టుకో..'' అంటే.. ''చూద్దాం'' అని దాటేసేవాడు అంటూ చెప్పారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి . ప్రస్తుతం జగన్ కాబినెట్ లో ఉన్న కొంత మంది మంత్రులు , మాజీ మంత్రులకు సంబంధించి ఆడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వాటిపై మాత్రం ప్రభుత్వం ఎక్కడగా కాంక్రీట్ గా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

Next Story
Share it