మోడీ..జగన్ ల 'చిరు ప్రేమ'కు కారణమేంటో?!
ప్రధాని మోడీ తమతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏ మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కన్పించలేదు. పైగా ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన ఏపీ బిజెపి ప్రెసిడెంట్ జె పి నడ్డా నోట కూడా పవన్ కళ్యాణ్ మాట కూడా రాలేదు. చూస్తుంటే బిజెపినే పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకుంటున్నట్లు కన్పిస్తోంది. అయినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన తరపున..ఏపీకి వస్తున్న ప్రధాని మోడీకి స్వాగతం అంటూ వీడియో విడుదల చేశారు. అంతే కాదు..తాను పోటీచేసిన భీమవరంలో ఈ కార్యక్రమం జరగటం సంతోషంగా ఉందని ప్రకటించారు. సోమవారం నాడు భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవిపై ప్రధాని మోడీ, సీఎం జగన్ లు ప్రత్యేక ప్రేమ చూపించారు.
ఈ చిరు ప్రేమకు కారణమేంటో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వాస్తవానికి చిరంజీవి తాను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేదిలేదని చెబుతూ వస్తున్నారు. అయినా సరే అటు మోడీ, ఇటు జగన్ లు చిరంజీవిపై ప్రత్యేక ప్రేమ చూపించటం ద్వారా జనసేన శ్రేణులు, చిరంజీవి అభిమానుల్లో ఒకింత గందరగోళం లేపటానికేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జనసేన నేతలు చిరంజీవి అభిమాన సంఘం ప్రతినిధులతో సమావేశం పెట్టి ఎవరైనాసరే పవన్ కళ్యాణ్ బాటలో నడవటానికి..ఆయన్ను సీఎంగా చేయటానికి ముందుకు వస్తే రావాలి తప్ప..మరో మాట ఉండకూదని స్పష్టం చేశారు. బిజెపి చిరుపై పోకస్ పెట్టడానికి ప్రత్యేక కారణాలు ఏమిటో భవిష్యత్ లో కాని తేలదు.