Telugu Gateway
Andhra Pradesh

భీమిలికి షిఫ్ట్ అయిన బొత్స కూతురు...అసలు కథ అదే!

భీమిలికి  షిఫ్ట్ అయిన  బొత్స కూతురు...అసలు కథ అదే!
X

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ కీలక నేత. కాకపోతే ఇప్పుడు ఆయనకు కాలం ఏ మాత్రం కలిసి రావటం లేదు.. ఆయన వేసుకున్న ప్లాన్స్ అన్ని కూడా రివర్స్ కొడుతున్నాయి. దీంతో బొత్స ఇప్పుడు తన రాజకీయ వ్యూహాలను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ రెండు సార్లు బహిరంగ వేదికలపై కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను వైసీపీ కి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ లో చేరిపోవటంతో బొత్స కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. కొద్ది రోజుల క్రితమే తన కుమార్తె బొత్స అనూష విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ రేస్ లో ఉంటుంది అని ప్రకటించారు. వైసీపీ లో ఇప్పటి వరకు అధికారికంగా ఇలాంటి ప్రకటన ఎవరూ చేయకపోయినా బొత్స మాత్రం కూతురి పేరు ప్రకటించుకుని రేస్ లోకి అందరి కంటే ముందే వచ్చేశారు. అయితే బొత్స మేనల్లుడు చిన్న శ్రీను పార్టీ మారటంతో మొత్తం రాజకీయం తిరగబడింది. చీపురుపల్లి జడ్పీటీసీ గా తన కూతురుని గెలిపించుకుని జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలని బొత్స అంతా రంగం సిద్ధం చేసుకున్నారు.

అయితే మారిన పరిస్థితుల్లో జిల్లా పరిషత్ చైర్మన్ సంగతి అటుంచి బొత్స అనూష ను అసలు జడ్పీటీసీ గానే గెలవనీయకుండా చేయాలనే ప్లాన్స్ కొంత మంది వేస్తుండటంతో విషయం తెలిసిన బొత్స రివర్స్ గేర్ వేశారు. వెంటనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తో గంట పాటు సమావేశం అయి తన ప్లాన్స్ మార్చుకుని తన కుమార్తె అనూష ను విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఇంచార్జి గా నియమించుకోవటంలో విజయవంతం అయ్యారు. దీని కోసం వైసీపీ చరిత్రలో మొదటి సారి ఐవిఆర్ఎస్ మోడల్ లో ప్రజాభిప్రాయం సేకరించి ఈ కసరత్తును పూర్తి చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఐవిఆర్ఎస్ ప్రజాభిప్రాయంలో బొత్స అనూషకు దగ్గర దగ్గర 24 శాతం అనుకూలంగా రాగా..మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు 14 శాతం అనుకూలంగా వచ్చినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే భీమిలి వైసీపీ క్యాడర్, నాయకుల్లో మాత్రం స్థానికులకు అవకాశం ఇస్తే బాగుటుంది అని...కానీ ఎప్పటి కప్పుడు విజయనగరం నుంచో...మరో చోట నుంచో నేతలను తెచ్చి తమ మీద రుద్దటం సరికాదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇలా బయటి నుంచి తెచ్చి పెట్టిన వాళ్ళు అంతా కూడా మధ్యలో పార్టీ ని వదిలేసి వెళుతున్నారు అని..అదే స్థానికులకు అవకాశం ఇస్తే మాత్రం ఆ పరిస్థితి ఉండదు అన్ని కొంత మంది నాయకులు చెపుతున్నారు. అయితే బొత్స తనకు ఉన్న పరపతి తోనే తన కూతురు బొత్స అనూష ను భీమిలి ఇంచార్జి గా నియమించుకోవడం లో సక్సెస్ అయ్యారు అని ఒక కీల నేత వెల్లడించారు. ముందు అనుకున్నట్లు జడ్పీ చైర్మన్ రేస్ లో నిలబెట్టి పోటీ చేసిన తొలిసారే ఓటమి చవిచూస్తే కుమార్తె రాజకీయ కెరీర్ ముగిసిపోతుంది అనే భయంతోనే ఆయన ఇప్పుడు ప్లాన్ బి లో భాగంగా భీమిలి కి ఆమె రాజకీయాన్ని షిఫ్ట్ చేసినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఈ ప్రయోగం ఎంత మేర సఫలీకృతం అవుతుంది...భీమిలి స్థానిక నేతలు వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎంత మేర సహకరిస్తారు అన్నది తెలియాలి అంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Next Story
Share it