Telugu Gateway
Andhra Pradesh

అమరావతిలో ఆధిపత్య పోరు!

అమరావతిలో ఆధిపత్య పోరు!
X

ప్రభుత్వంలో ఏ శాఖ అయినా సాఫీగా సాగాలంటే సంబంధిత మంత్రి...ఆ శాఖలోని ఉన్నతాధికారులు సఖ్యతతో కలిసి పని చేయటం ఎంతో కీలకం. రాజధాని అమరావతి వంటి కీలక ప్రాజెక్ట్ అమలు చేస్తున్న శాఖ కు ఇది ఎంతో అవసరం. కానీ ఇప్పుడు మున్సిపల్ శాఖలో..ముఖ్యంగా సీఆర్ డీఏలో పరిస్థితి గందరగోళంగా మారింది అని ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సిఆర్ డీఏ కమిషనర్ గా ఉన్న కన్నబాబును అక్కడ నుంచి తప్పించి పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ గా ఉన్న విజయరామరాజును సిఆర్ డీఏ కమిషనర్ గా నియమించిన సంగతి తెలిసిందే. విచిత్రం ఏమిటి అంటే విజయరామరాజు ఈ పోస్ట్ లోకి వచ్చి ఇంకా నిండా మూడు నెలలు కాలేదు కానీ...మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సిఆర్ డీఏ కమిషనర్ విజయరామరాజు ల మధ్య గ్యాప్ గణనీయంగా పెరిగింది అని ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. మంత్రి నారాయణ ఆదేశాలను కమిషనర్ ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు అనే ప్రచారం మున్సిపల్ శాఖలో పెద్ద ఎత్తున సాగుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంలోని పెద్దల అండదండలు విజయరామ రాజు ఉండటమే అని చెపుతున్నారు. ఈ పోస్ట్ లోకి విజయరామరాజును తీసుకురావటానికి వెనక కథ మంత్రి నారాయణకు చెక్ పెట్టడం కోసమే అన్న ప్రచారం కూడా తెలుగు దేశం వర్గాల్లో ఉంది. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఆయన మంత్రి మాటలను పట్టించుకోకుండా పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు అని...ప్రభుత్వ పెద్దలకే తాను సమాధానం చెప్పాలి కానీ...మంత్రి కాదు అన్న చందంగా కమిషనర్ వ్యవహరిస్తున్నట్లు ఆ శాఖ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఒక్క మంత్రితోనే కాదు...అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజిఐసిఎల్) ఎండీ ఎస్ వి ఆర్ శ్రీనివాస్, సిఆర్ డీఏ కమిషనర్ల మధ్య కూడా గ్యాప్ బాగా ఉంది అని... ఈ ప్రభావం అమరావతి పనులపై పడుతుంది అని చెపుతున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకునేందుకు ఇద్దరు అధికారులు కూడా ఒకే సారి సమావేశాలు పెట్టి చాలా మంది కింది అధికారులను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నట్లు ఆ శాఖ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి నారాయణ, ఏజిఐసిఎల్ ఎండీ ఎస్ వి ఆర్ శ్రీనివాస్ లు మాత్రం ఒకింత సమన్వయంతోనే పని చేస్తున్నట్లు చెపుతున్నారు. అసలు రాజధాని అమరావతి పనులు ఈ టర్మ్ లో అన్నా షెడ్యూల్ ప్రకారం పూర్తి అవుతాయో లేదో అన్న అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్న వేళ..మంత్రి కీలక అధికారుల మధ్య విభేదాలు పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తున్నాయి అని చెపుతున్నారు. ప్రభుత్వం పెద్దలు మాత్రం తమకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు అప్పగించి మిగిలిన విషయాలపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు అనే అభిప్రాయం కూడా టీడీపీ నేతల్లోనే ఉంది.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మంత్రి నారాయణ కూడా అమరావతి పనుల విషయంలో గతంలో ఉన్నట్లు కాకుండా పెద్ద ఎత్తున తేడాలు చేయటం వల్లే ఈ సారి ఆయన అధికారాలకు కత్తెర వేసినట్లు టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. కారణాలు ఏమైనా కూడా ఈ ఆధిపత్య పోరు...మంత్రి..అధికారుల మధ్య విబేధాల కారణంగా అమరావతి ప్రాజెక్ట్ లో విపరీత జాప్యం జరుగుతున్నట్లు ఆ శాఖ వర్గాలు కూడా చెపుతున్నాయి. గతం తో పోలిస్తే ఈ సారి అమరావతికి కేంద్రం మద్దతు తో పాటు అప్పులు కూడా భారీగా సమకూరినందున నిధుల సమస్య లేదు అని చెపుతున్నారు. కానీ శాఖలో నెలకొన్న సమస్యలే ఇప్పడు అమరావతికి అతి పెద్ద సమస్యగా మారాయి అని మున్సిపల్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెడతారో లేదో చూడాలి.

Next Story
Share it