Telugu Gateway
Andhra Pradesh

బ‌స్టాండ్ క‌ట్ట‌లేని జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు క‌డ‌తారా?

బ‌స్టాండ్ క‌ట్ట‌లేని జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు క‌డ‌తారా?
X

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు వ్యంగాస్త్రాలు సంధించారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో బ‌స్టాండ్ క‌ట్ట‌లేని సీఎం జ‌గ‌న్..మూడు రాజ‌ధానులు క‌డ‌తారా అని ఎద్దేవా చేశారు. వైసీపీ పాల‌న‌లో పేద‌ల జీవితాలు దుర్భ‌రంగా మారాయ‌ని..స‌మ‌స్య‌ల గురించి మాట్లాడిన వారిపై దాడులు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇలాంటి పాల‌న తాను ఎప్పుడూ చూడ‌లేద‌న్నారు. చంద్ర‌బాబు బుధ‌వారం నాడు క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ఏపీలో సమర్థులు, మంచివారు లేనట్లు కొందరికి రాజ్యసభ సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నందునే అప్పులు పుట్టలేదని, సొంత నియోజకవర్గానికి తాగునీరు ఇవ్వలేని సీఎం రాష్ట్రాభివృద్ధి చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

అధిక అప్పుల‌తో జ‌గ‌న్ రాష్ట్రం ప‌రువు తీస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైసీపీ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తిరుగుబాటు వ‌చ్చింద‌ని..ఈ ప్ర‌భుత్వాన్ని ఇక ఎవ‌రూ కాపాడ‌లేర‌ని వ్యాఖ్యానించారు. ఒంగోలులో మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌కు స్టేడియం అడిగితే ఇవ్వ‌లేద‌ని..తాను సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఇలాగే చేస్తే జ‌గ‌న్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేవారా అని ప్ర‌శ్నించారు. సీఎం జ‌గ‌న్ చెప్పిన రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. మాజీమంత్రి వివేకా హత్య విషయంలో జగన్ విశ్వసనీయత ప్రజలకు తెలిసిపోయిందన్నారు. వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు, అధికారులు కూడా ప్రజావ్యతిరేకంగా పనిచేస్తున్నారని చంద్రబాబు తప్పుబట్టారు.

Next Story
Share it