ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాల్సిందే

అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తమ హీరో ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో పాటు ఆయన తల్లిని కూడా ఇష్టానుసారం విమర్శించిన ఎమ్మెల్యేను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి డిమాండ్ చేశారు. మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చే టీడీపీ లో ఉంటూ ఒక మహిళ, ఎన్టీఆర్ తల్లిపై అకారణంగా ఇష్టానుసారం మాట్లాడిన ఆయన రెండు రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేదు అంటే తమ కార్యాచరణ ప్రారంభిస్తాం అని తెలిపారు. తాము అంతా కూడా టీడీపీ లో ఉంటూనే ఎన్టీఆర్ అభిమానులుగా ఉన్నామన్నారు. అయితే రాజకీయాలనూ...సినిమాలను తాము ఎప్పుడు కలపటం లేదు అని...దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో పాటు కొంత మంది నేతలు అప్పుడప్పుడు తమ హీరో ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నారు అని విమర్శించారు.
అందుకే తాము ఈ సారి ఈ వ్యవహారంలో సీరియస్ గా ఉన్నామని..ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పకపోతే తాము ఏమి చేయాలో కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు చెందిన ప్రతినిధులు బుధవారం నాడు హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో మీడియా తో మాట్లాడారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత అనంతపురం లో సినిమా ఆపటానికి ఆయన ఎవరు అని ప్రశ్నించారు. కావాలనుకుంటే ముందే ప్రభుత్వంలో మాట్లాడుకుని అనంతపురం లో ఎన్టీఆర్ సినిమా ను ఆపి వేయించాల్సింది అన్నారు. అంతే కానీ ఫ్యాన్స్ కు ఫోన్ చేసి ఇష్టానుసారం మాట్లాడటం మంచి పద్ధతి కాదు అని హెచ్చరించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ పై టీడీపీ ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. ఇది ఇలా ఉంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అంశంపై తొలుత తాము అనంతపురం లో మీడియా సమావేశం పెట్టాలని నిర్ణయించుకున్నాం అని..కానీ పోలీస్ ల నుంచి వచ్చిన విపరీతమైన ఒత్తిడి వల్ల అది సాధ్యం కాలేదు అన్నారు. విజయవాడ లో కూడా అదే పరిస్థితి ఎదురైంది అని...అక్కడ ప్రెస్ క్లబ్ దగ్గర పెద్ద ఎత్తున పోలీస్ లను మోహరించి ఎవరిని లోపలికి అనుమతించలేదు అని తెలిపారు.
దీంతో అందరం కలిసి హైదరాబాద్ లో మీడియా ముందుకు రావాల్సి వచ్చింది అని తెలిపారు. వార్ 2 విడుదల సమయంలో ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం నేతలతో మాట్లాడినట్లు బయటకు వచ్చిన ఆడియో పెద్ద దుమారమే రేపింది. ఇది ఫేక్ అని...దీనిపై ఎస్పీ కి ఫిర్యాదు చేశాను అని చెప్పిన ఎమ్మెల్యే...అయినా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడిఉంటే క్షమాపణ చెపుతున్నట్లు ఒక వీడియో విడుదల చేశారు. నిజంగా ఫేక్ అయితే ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమి ఉంది అన్న చర్చ కూడా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు రావటంతో ఇది అంతా నిజం అన్న అభిప్రాయం అందరిలో కలిగింది. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో సీరియస్ గా స్పందిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.



