ఏడాదిన్నరలో ఇంత ఇరకాటం ఇదే!

ఏ పార్టీ కి అయినా ఒక్క అంశం చాలు రాజకీయంగా ఫినిష్ కావటానికి. ఎంత మంచి చేసినా ఒక్కో సారి ఒక్క అంశమే ఎంతో డ్యామేజ్ చేస్తుంది. మొత్తం వ్యవస్థను కుప్పకూలుస్తుంది. గతంలో ఎన్నో ఉదంతాలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ కి చంద్రబాబు అండ్ కో పెద్ద లైఫ్ లైన్ ఇచ్చినట్లు అయింది. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అప్పగించాలని నిర్ణయించటం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రాజకీయంగా టీడీపీ సారథ్యంలోని కూటమి సర్కారు ఇంత ఇరకాటంలో పడిన అంశం మరొకటి లేదు అని చెప్పొచ్చు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీపీపీ విధానం పుట్టిందే పేదల కోసం...ప్రజల కోసం అని ఎంత చెప్పినా నమ్మటం కష్టమే. ఎందుకంటే ఇందులో జరిగేది ఏంటో ఈ విధానంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్, ప్రైవేట్,పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయాలనే కూటమి ప్రభుత్వం నిర్ణయం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. ఈ మొత్తం వ్యవహారం కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఇరకాటంలో పడేసింది అనే చెప్పాలి. ఇదే ఇప్పుడు వైసీపీ కి రాజకీయంగా ఒక పెద్ద అస్త్రంగా మారింది. పీపీపీ విధానంలో కూడా ఈ కాలేజీలను ప్రచారంలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ప్రభుత్వ పెద్దలకు చెందిన అస్మదీయ సంస్థలకు అప్పగిస్తే అప్పుడు ఈ వివాదం మరింత రాజుకోవటం ఖాయం. దీని వాళ్ళ జరిగే నష్టం మరింత పెరగటం ఖాయం అనే భయం టీడీపీ నేతల్లోనే ఉంది.
ఇప్పటికే ఈ విషయంలో టీడీపీ కి రాజకీయంగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది అనే అభిప్రాయం టీడీపీ నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త వాదన తెర మీదకు తీసుకువచ్చారు. అమరావతిపై లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడానికి సిద్ధపడిన చంద్రబాబు సర్కారు ..కొత్తగా నిర్మించాల్సిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టలేదా అని ప్రశ్నించారు. వైసీపీ తీసుకున్న ఈ లైన్ రాబోయే రోజుల్లో టీడీపీ ని మరింత ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉంది అనే అభిప్రాయం ఎక్కువ మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పీపీపీ కింద ఇవి ఎవరికి ఇస్తారు అన్నది కూడా ఎంతో కీలకంగా మారబోతుంది. గత వైసీపీ హయాంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి. వీటిని 8480 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే జగన్ హయాంలో వీటిలో కేవలం ఐదు కాలేజీల నిర్మాణం మాత్రమే తుది దశకు వచ్చింది.
మిగిలినవి అన్ని కూడా ప్రాధమిక దశలోనే ఉన్నాయి. కాకపోతే జగన్ ఇప్పుడు తాను అన్ని కాలేజీలు నిర్మించినట్లు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు వీటిని పీపీపీ విధానంలో కట్టబెట్టాలని నిర్ణయించటం రాజకీయంగా ఆయనకు ఇది కలిసి వచ్చింది అనే చెప్పొచ్చు. చంద్రబాబుతో పాటు కూటమి నేతలు ఈ విషయంలో ఎన్ని చెప్పినా కూడా జరగాల్సిన డ్యామేజ్ ఇప్పటికే జరిగిపోయింది అని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు ప్రతిపక్షంలో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ కూడా జగన్ మెడికల్ కాలేజీ సీట్లు అమ్ముకుంటున్నారు అని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవో ను వంద రోజుల్లో రద్దు చేస్తామని చెప్పుకొచ్చారు.
తీరా ఇప్పుడు ఆ జీఓ రద్దు సంగతి అటుంచి ఇప్పుడు ఏకంగా కాలేజీలనే పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్లకు అప్పగించటానికి నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు పట్టిసీమ దగ్గర నుంచి పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్ట్ లను ఎవరూ చేయని రీతిలో రికార్డు సమయంలో పూర్తి చేయగల సత్తా ఉన్న చంద్రబాబు కు కేవలం మెడికల్ కాలేజీలు పూర్తి చేయటానికి మాత్రమే దశాబ్దాలకు దశాబ్దాలు పడుతుంది అంటే ఇదేమి లెక్క అన్న ప్రశ్న ఉదయించకుండా ఉంటుందా?. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యం గా చంద్రబాబు ను ఈ వ్యవహారం రాజకీయంగా ఇరకాటంలో పడేయటం ఖాయం అనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పెండింగ్ లో ఉన్న ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేసేందుకు అయ్యే వ్యయం విషయంలో కూడా ఒక్కొక్కరు ఒక్కో మొత్తం చెపుతూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. ఈ గండం నుంచి కూటమి సర్కారు ఎలా బయటపడుతుందో చూడాలి.



