Telugu Gateway
Andhra Pradesh

బలంగా ఉన్న ఏపీ లో పొత్తులు..బలం లేని తెలంగాణాలో ఒంటరి పోరు

బలంగా ఉన్న ఏపీ లో పొత్తులు..బలం లేని తెలంగాణాలో ఒంటరి పోరు
X

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ కి దాదాపు నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది . వైసీపీ వేవ్ లోనూ ఆ పార్టీ ఇంత ఓటు బ్యాంకు నిలబెట్టుకోవటం మాములు విషయం ఏమీ కాదు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పొత్తులతో ముందుకు సాగాలని యోచిస్తోంది. రాజకీయాల్లో పొత్తులు వింతేమీ కాదు...ఇది తప్పు కూడా కాదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగు దేశం, జన సేనలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం బలంగా ఉంది. వీళ్ళతో బీజేపీ జాయిన్ అవుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే తెలుగు దేశం పార్టీ బలంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న పార్టీ...అంతగా బలం లేని తెలంగాణలో మాత్రం ఒంటరిగా పోటీ చేయాలనీ నిర్ణయం తీసుకోవటం చూసే వాళ్లకు ఆశ్చర్యం కలిగించటమే కాకుండా....ఇందులో ఏదో పెద్ద రాజకీయ కుట్ర ఉంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశంపై మంగళవారం నాడు ఢిల్లీ లో మీడియా తో చిట్ చాట్ చేసిన చంద్రబాబు తెలంగాణలో టీడీపీ ఒంటరిగా పోటీ ఉంటుంది అని స్పష్టం చేశారు. తెలంగాణాలో బీజేపీ తో పొత్తుకు సమయం మించి పోయింది అని వ్యాఖ్యానించటం విశేషం. బీజేపీ కేంద్ర నాయకత్వం ప్లాన్ లో భాగంగానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు అని...సాధ్యమైనంత మేర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి అధికార బిఆర్ఎస్ కు మేలు చేయటమే లక్ష్యంగా ఈ నిర్ణయం ఉంది అని ఒక సీనియర్ నేత వెల్లడించారు.

తెలంగాణాలో బిఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు కానీ..కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ లో అధికారంలోకి రాకూడదు అనే బీజేపీ ప్లాన్ అమలులో భాగంగానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది అని ఒక కీలక నేత వెల్లడించారు. బిఆర్ఎస్ ను ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకోవచ్చు అని...అదే హైదరాబాద్ వంటి కీలక నగరం ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తమకు నష్టం అనే అంచనాతోనే బీజేపీ ఈ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెపుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ జోష్ లో ఉండగా..తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ కు సానుకూల వాతావరణమే ఉంది. ఈ తరుణంలో టీడీపీ నిజంగా తెలంగాణాలో ప్రభావం చూపించాలి...కొన్ని సీట్లు అయినా గెలవాలి అనుకుంటే బీజేపీ తో కాకపోయినా జనసేన తో కూడా కలిసి సాగే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు బలంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం పొత్తులతో ముందుకు వెళ్లాలని యోచిస్తూ...తెలంగాణాలో మాత్రం ఒంటరి జపం చేస్తున్నారు అంటే అయన ప్లాన్స్..అయన ఎవరి కోసం పని చేస్తున్నారో ప్రజలకు ఆ మాత్రం అర్ధం కదా అన్న చర్చ సాగుతోంది.

Next Story
Share it