ఫీడ్ బ్యాక్ మోడల్ తో సహా అంతా మారింది!

ప్రతి నిర్ణయం తీసుకునే ముందు దాని వల్ల ఉండే ప్రభావం...సామాజిక సమీకరణాలు...రాజకీయంగా ఆ నిర్ణయం వల్ల నష్టమా...లాభమా వంటి కోణాల్లో ఆలోచిస్తారు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తారు. గత కొంత కాలంగా అటు టీడీపీలో...ఇటు ప్రభుత్వంలో కూడా నారా లోకేష్ ప్రభావం గణనీయంగా పెరిగిపోయింది అనే విషయం స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తో పోలిస్తే నారా లోకేష్ నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉంటున్నారు అనే చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. పైగా అది పార్టీ పదవి అయినా...రాజ్యసభ సీటు అయినా ఆయన నిర్ణయం తీసుకునేటపుడు అతను తన వాడా కాదా అని చూస్తున్నారు తప్ప...ఆ వ్యక్తికి ప్రజల్లో ఉన్న పేరు ఎలాంటిది అనే విషయాన్ని కూడా ఏ మాత్రం పట్టించుకోవటం లేదు అని ఒక సీనియర్ మంత్రి వెల్లడించారు. నారా లోకేష్ తన వాళ్లకు మార్కెట్ లో ఎలాంటి పేరు ఉంది...ఆ నిర్ణయం తీసుకోవటం వల్ల పార్టీకి..ప్రభుత్వానికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందా అనే విషయాన్ని కూడా ఏ మాత్రం పట్టించుకోవటం లేదు అని ఆయన వెల్లడించారు.
అదే సమయంలో నారా లోకేష్ మనుషులుగా ముద్రపడిన వాళ్లకు సంబంధించి మీడియా లో ఎన్ని వ్యతిరేక వార్తలు వచ్చినా కూడా డోంట్ కేర్ అన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారు అని పార్టీ నేతలు చెపుతున్నారు. ఇవేమి కూడా తన నిర్ణయాలను ప్రభావితం చేయలేవు అన్న చందంగా నారా లోకేష్ నిర్ణయాలు ఉంటున్నాయి అని చెపుతున్నారు. ఒక సెక్షన్ కు నారా లోకేష్ నిర్ణయాలు బాగా ఉన్నట్లు అనిపించవచ్చు అని..అయితే దీర్ఘకాలంగా అవి పార్టీపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదు అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. లోకేష్ వర్కింగ్ స్టైల్ చూసి ఇప్పుడు పార్టీలో..ప్రభుత్వంలో ఎక్కువ మంది తమకు పనులు వేగంగా కావాలన్నా...పదవులు రావాలన్నా లోకేష్ టీం లోకి వెళ్ళటమే ఉత్తమం అన్న ఆలోచనలో ఉన్నారు అనే చర్చ కూడా సాగుతోంది. ఇక్కడ మరొక కీలక విషయం ఏమిటి అంటే ఒకప్పుడు పార్టీ ఆఫీస్ లో పని చేసే వాళ్లలో ఎక్కువ మంది నాయకులు ఉండేవాళ్ళు. వివిధ రకాల సమాచార సేకరణ తో పాటు అన్ని అంశాల్లో కూడా పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా పూర్తిగా మారిపోయింది. మారిన విధానంలో భాగంగా ఎక్కువ శాతం ఉద్యోగులపై ఆధారపడుతున్నారు తప్ప...పార్టీ నాయకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే విధానం తగ్గిపోయింది అని ఒక సీనియర్ నేత వెల్లడించారు.
పైగా పొలిటికల్ కన్సల్టెంట్స్...ఎలక్షన్ స్ట్రాటజీ లకు కూడా ఎక్కువగా ఉద్యోగులు...ఏజెన్సీల వంటి వాటిపైనే ఆధారపడే పరిస్థితి వచ్చింది. గతంలో పార్టీ కోసం పని చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఎక్కడా కనిపించకుండా పోయారు అని సీనియర్ నేతలు చెపుతున్నారు. పైకి ఎన్ని ప్రచారాలు జరిగినా కూడా కీలక నిర్ణయాలు అన్నీ కూడా చంద్రబాబు, లోకేష్ లు కలిసే తీసుకుంటున్నారు అని...కానీ బయటకు మాత్రం ఇప్పుడు అంతా లోకేష్ హవానే అని ప్రచారం చేయటం వెనక కూడా రాజకీయ వ్యూహం ఉంది అనే చర్చ కూడా పార్టీ నేతల్లో ఉంది. నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా తప్పు...పొరపాట్లు ఉంటే చంద్రబాబు నాయుడు తన తనయుడు, మంత్రి నారా లోకేష్ ను ఒప్పించటం పెద్ద కష్టమా అని ఒక సీనియర్ నేత ప్రశ్నించారు. అన్ని పనులు ఇద్దరికీ తెలిసే జరుగుతున్నాయి...నిర్ణయాలు అన్నీ ఇద్దరూ అనుకునే తీసుకుంటున్నారు అని మరో నేత వెల్లడించారు. క్రమమంగా పార్టీని పూర్తిగా నారా లోకేష్ చేతుల్లో పెట్టే దిశగా జరుగుతున్న మార్పులే ఇవి అన్నీ అని...వీటికి ఇప్పటి నుంచే పార్టీ నేతలను అలవాటు చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు.



