సీఎం ప్రమాణ స్వీకారానికి అసలు ఇన్విటేషన్ పంపారా?!
తెలంగాణ సీఎం షెడ్యూలు లో లేని ఏపీ టూర్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి ఆంధ్ర ప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారా?. తెలంగాణ అధికార వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి మీడియా తో చిట్ చాట్ చేస్తూ ఆహ్వానం వస్తే తాను చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వెళతానని చెప్పినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. అయితే అది పూర్తిగా పార్టీ నిర్ణయం ప్రకారమే ఉంటుంది అని కూడా చెప్పారు. అయితే చంద్రబాబునాయుడు నాల్గవ సారి బుధవారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రికి అధికారికంగా ఆహ్వానం కూడా అందలేదు అని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు రేవంత్ రెడ్డి బుధవారం షెడ్యూల్ లో కూడా ఈ కార్యక్రమం లేకపోవటం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ తో పాటు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ....ఇతర బీజేపీ నేతలు వస్తున్నందున రేవంత్ రెడ్డి ని పిలవలేదు అని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. తెలంగాణ నుంచి కొత్తగా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న బండి సంజయ్ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు అవుతున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతం లో టీడీపీ లో కొన్ని సంవత్సరాల పాటు ఉన్న ఉన్న విషయం తెలిసిందే. అక్కడ నుంచే కాంగ్రెస్ లో చేరారు. ఆయన కాంగ్రెస్ లో చేరినా ఎప్పుడూ టీడీపీ పై కానీ...చంద్రబాబు పై విమర్శలు చేసింది లేదు. చంద్రబాబు కు రేవంత్ రెడ్డి తో సత్సంబంధాలు ఉన్నా కూడా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారానికి పిలవకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో అమరావతి శంకుస్థాపన సందర్భంగా బిఆర్ఎస్ అధినేత, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో రాజకీయ, వ్యక్తిగత విబేధాలు ఉన్నా కూడా ఆయన్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కూడా అప్పటిలో మోడీనే ముఖ్య అథితిగా హాజరు అయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం మోడీ, అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు వస్తున్న కారణంగా అది కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి విషయంలో రిస్క్ తీసుకోవటం ఇష్టం లేకే ఇలా చేశారు అనే చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఈ విషయం రెండు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారటం ఖాయం అనే చెప్పొచ్చు.