బొండా ఉమా..బుద్ధా వెంకన్నలకు చంద్రబాబు 'సరెండర్'
కేశినేని నాని లేకుండానే చంద్రబాబు ప్రచారం
షాకింగ్ పరిణామం. విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్థానిక ఎంపీ కేశినేని నానిని పక్కన పెట్టారు. ఆయన లేకుండానే చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆదివారం ఉదయం ప్రారంభం అయిన రోడ్ షోలో చంద్రబాబుతోపాటు టీడీపీ మేయర్ అభ్యర్ధి కేశినేని శ్వేతతోపాటు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఇందులో ఎక్కడా ఎంపీ కేశినేని నాని కన్పించలేదు. అంటే రాజీ వ్యవవహారం వెనక ఎంపీ కేశినేని నానిని చంద్రబాబు టూర్ కు దూరం పెట్టాలనే అసమ్మతి నేతల షరతులకు అధిష్టానం అంగీకరించినట్లు కన్పిస్తోంది. ఇది చంద్రబాబునాయుడి బలహీనతను స్పష్టం చేస్తోందనే విషయం మరోసారి నిరూపితం అయింది. కారణాలు ఏమైనా కేశినేని నాని స్థానిక ఎంపీ, అంతే కాదు..మేయర్ అభ్యర్ధి స్వయంగా ఆయన కూతురు శ్వేత.
సర్దుబాటు అంటే గెలిచిన ఎంపీని పక్కన పెట్టి ఓడిన వారిని పక్కన పెట్టుకుని ప్రచారం చేయటమా? అన్న చర్చ తెరమీదకు రావటం ఖాయం. కేశినేని నాని ఉంటే తాము చంద్రబాబు టూర్ కు దూరం గా ఉంటామని ప్రకటించిన బొండా ఉమా, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాల డిమాండ్ కు చంద్రబాబు తలొగ్గినట్లు అయిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. శనివారం ఉదయం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన స్థానిక నేతలు సాయంత్రానికి మాట మార్చి..శ్వేత అభ్యర్ధిత్వానికి తాము వ్యతిరేకం కాదని ప్రకటించారు.