చంద్రబాబుకు ఈ ప్రత్యేక ప్రేమ ఏంటో!
పరిపాలనా వ్యవస్థలో అత్యంత పవర్ ఫుల్ పోస్ట్ అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్). ఇది అందరికి తెలిసిన విషయమే. నిన్న మొన్నటి వరకు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ నే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్లను పక్కన పెట్టి మరీ సిఎస్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విజయానంద్ చేసిపెట్టిన మేళ్లు దృష్టిలో పెట్టుకునే అయన కు ఈ పదవి ఇచ్చారు అనే ప్రచారం అధికార వర్గాల్లో ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఎస్ గా ఉన్న విజయానంద్ కే విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో పాటు ఏపీ ట్రాన్స్ కో సీఎండీ పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహజంగా సిఎస్ వంటి కీలక పోస్ట్ లో ఉన్న వాళ్లకు రెగ్యులర్ సబ్జెక్ట్స్ అప్పగించరు. మొత్తం పరిపాలన మానిటర్ చేయటం..ప్రభుత్వ ఆదేశాలు సరిగా అమలు అవుతున్నాయా లేదా వంటి అంశాలను మాత్రమే సిఎస్ లు పరిశీలిస్తారు. కానీ అందుకు బిన్నంగా విజయానంద్ కు చంద్రబాబు సర్కారు ఆయన చేసిన పాత పోస్ట్ నే తిరిగి ఆయనకే పూర్తి అదనపు బాధ్యతల పేరుతో అప్పగించింది అంటే విజయానంద్ ఈ ప్రభుత్వంలో ఎంత పవర్ ఫుల్ అయిపోయారో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత కెసిఆర్ హయాంలో సోమేశ్ కుమార్ కూడా ఇలాగే సిఎస్ గా ఉండి రెగ్యులర్ సబ్జెక్టు లు చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కెసిఆర్ మోడల్ లో సిఎస్ కు అత్యంత కీలకమైన విద్యుత్ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. అంటే విద్యుత్ శాఖలో విజయానంద్ ద్వారా నడిపించాల్సిన పనులు కొన్ని పెండింగ్ లో ఉండి ఉంటాయి అని...అందుకే సిఎస్ అయినా తర్వాత కూడా ఆయనకు విద్యుత్ శాఖతో పాటు ట్రాన్స్ కో సీఎండీ పదవి పూర్తి అదనపు బాధ్యతల కింద అప్పగించారు అని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సహజంగా ప్రభుత్వం చెప్పిన పనులు ఏ అధికారి ఉంటే ఆ అధికారి చేస్తారు. కానీ కొన్ని ప్రత్యేక పనులు...కొన్ని డీల్స్ విషయంలో కొంత మందికి మాత్రమే నైపుణ్యం ఉంటుంది అని...వాటికి అనుగుణంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారు అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.