Telugu Gateway
Andhra Pradesh

ఆ లెక్కలు ఇవే

ఆ లెక్కలు ఇవే
X

కేంద్రంలోని మోడీ సర్కారును ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయం అందించాలని కోరారా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. అది కూడా త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లోనే వీటికి చోటు కలిపించాలని చంద్రబాబు కోరినట్లు జాతీయ మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. మోడీ సర్కారులో టీడీపీతో పాటు జేడీయూ లు కీలక భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండు పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం నిలబడింది. ఒక వైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేదంటే ఆ మేరకు ఆర్థిక సాయం అయినా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా రెండు రోజులు ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోడీ తో పాటు కేంద్రంలోని కీలక మంత్రులు అందరిని కలిసి వచ్చిన చంద్రబాబు పలు ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెట్టినట్లు చెపుతున్నారు. అందులో ప్రధానమైనవి కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి మొత్తం 50 వేల కోట్ల రూపాయలు అవుతుంది. దీనికి అవసరం అయ్యే మొత్తంలో నుంచి తొలి విడతగా 15 వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కేటాయించాలి అని కోరారు.

ఇదే తరహాలో ఈ ఏడాది పోలవరం ప్రాజెక్ట్ కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి..మరిన్ని నిధులు ఇవ్వటానికి అంగీకరించాలి. వచ్చే ఐదేళ్లలో బకాయిపడిన అప్పు తీర్చటానికి మరో పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఫెడరల్ ప్రభుత్వ 50 సంవత్సరాల లోన్ స్కీం కింద మౌలిక సదుపాయాల అభివృద్ధికి పది వేల కోట్ల రూపాయల అందించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఇవే కాకుండా 2025 మార్చి నాటికీ ప్రస్తుతం ఉన్న అప్పు పరిమితిని మరో 0 .5 శాతం మేర పెంచే వెసులుబాటు కలిపించాలని కోరారు. ఈ మొత్తం ఏడు వేల కోట్ల రూపాయలు అవుతుంది అని లెక్కకట్టారు. అయితే ఆర్థిక సాయం అందించటానికి ప్రధాని మోడీ ఓకే చెప్పారు కానీ..అయితే ఇది ఎంత మొత్తంలో ఉంటుంది అన్నది మాత్రం తేలాల్సి ఉంది. మొత్తం మీద చంద్రబాబు కేంద్రం ముందు 12 బిలియన్ డాలర్స్ అంటే మన భారతీయ కరెన్సీ లో దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయల మేర సాయం కోరినట్లు జాతీయమీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత మేర వాస్తవరూపం దాలుస్తుంది అన్నది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కానీ తేలదు.

Next Story
Share it