Telugu Gateway
Andhra Pradesh

ఎన్నికేసులు ఉంటే అంత భవిష్య‌త్

ఎన్నికేసులు ఉంటే  అంత భవిష్య‌త్
X

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ ఇద్ద‌రూ ఒకే మాట మీద ఉన్నారు. ఎవ‌రిపై ఎక్కువ కేసులు ఉంటే వారికే భ‌విష్య‌త్ ఉంటుంద‌ని నేత‌లిద్ద‌రూ వ్యాఖ్యానిస్తున్నారు. అంటే నేత‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్ ను కేసులు నిర్ణ‌యిస్తాయ‌న్న మాట‌. టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక ఒక ట్రిబ్యున‌ల్ వేసి అన్ని కేసుల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు గురువారం నాడు విశాఖ పార్టీ కార్యాల‌యంలో పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2029 నాటికి దేశంలోని నెంబర్ వన్‌గా తీర్చి దిద్దాల్సిన ఏపీని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని విమర్శించారు. జగన్ జె బ్రాండ్స్‌, డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. జగన్మోహ‌న్ రెడ్డి చేస్తున్న అప్పులన్నీ మనమే కట్టాలని అన్నారు.

అన్నింటి మీద పన్నులు వేస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు. గ్రామానికో రౌడీని, సైకోను తయారు చేశారని, సైకోలను పూర్తిగా అణచివేస్తామన్నారు. పదవులు రావాలంటే ప్రజలతోనే ఉండాలని.. తనతో కాదన్నారు. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మనమేమి బాబాయిని చంపలేదు.. కోడి కత్తి డ్రామాలు ఆడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని పెంచాల‌ని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు సూచించారు. బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాన్ని ఇంటింటికి తీసుకెళ్ళాల‌ని సూచించారు. వ‌చ్చే 30 సంవ‌త్స‌రాలు పార్టీ అధికారంలో ఉండేలా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

Next Story
Share it