Telugu Gateway
Andhra Pradesh

దగ్గుబాటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు

దగ్గుబాటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు
X

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నోట తొలి సారి రిటైర్మెంట్ మాటలు వినిపించాయి. ఈ మాటలు కేవలం దగ్గుబాటి వెంకటేశ్వర రావు గురించి చెపుతూ యధాలాపంగా అన్నారా...లేక ఆయన ఈ వేదిక నుంచి ఒక ఇండికేషన్ ఇవ్వాలనుకున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా పని చేసిన చంద్రబాబు ఈ టర్మ్ చివరిలో నారా లోకేష్ ను సీఎం చేసే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. దీనికి వీలుగా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ను పార్టీ నేతలు కొద్ది కాలం క్రితం తెరమీదకు తెచ్చారు. ఇది జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు..జనసేన నేతలకు ఏ మాత్రం రుచించలేదు అనే అభిప్రాయం కూడా ఉంది. తర్వాత నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ మరుగున పడిపోయింది.

ఈ తరుణంలో చంద్రబాబు వైజాగ్ వేదికగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కూడా ఇప్పుడు రిటైర్మెంట్ పరిస్థితి వస్తే ...ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ‘వెంకటేశ్వరరావు గురించి చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్ గా ..జోవియల్ గా ఉండే వ్యక్తి. చాలా ఈజీ గా ..ఎన్ని కష్టాలున్నా..ఏమి ఉన్నా ,మనిషి కనిపించినప్పుడు హ్యాపీ గా ఉంటారు. ఇటీవల ఒక సారి కలిశాం. కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. యాక్టీవ్ లైఫ్ లో ఉన్నారు. అకస్మాత్తుగా రిటైర్డ్ లైఫ్ మాదిరిగా హ్యాపీగా ఉన్నారు. ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీరు టైం అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ..ఇప్పుడు నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి. అయన ఒకటే చెప్పారు. చాలా హ్యాపీగా ఉన్నా. నిద్ర లేస్తే బాడ్మింటన్ ఆడుకుంటా. వచ్చిన తర్వాత మనవరాళ్లు...మన వళ్ళు తో ఆడుకుంటా.

అక్కడ నుంచి కాసేపు గాసిప్స్ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటాం. మళ్ళా పేకాటకు వెళ్తాడు. మధ్యాహ్నం అయితే పేకాటకు వెళతాడు. అదో రెండు గంటలు ఆడితే మైండ్ స్టిములేట్(ఉత్తేజం) అవుతుంది. హ్యాపీగా వచ్చి నిద్రపోతాను.’ అని చెప్పారు. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. పిల్లలకు రాత్రిళ్ళు స్టోరీలు చెప్పి హ్యాపీగా నిద్రపోతాడు. అదే మాదిరిగా ఫ్రెండ్స్ తో కలిసి విదేశాల్లో తిరగటం ప్రారంభించారు. పోయినప్పుడు అక్కడ కూడా అధ్యయనం చేయటం వంటివి చేశారు అంటూ చంద్రబాబు వైజాగ్ లో దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. ఈ వేదిక నుంచే దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, తనకు మధ్య గతంలో విబేధాలు ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అని..అయితే అవన్నీ గతం అన్నారు. వాటి గురించి అవసరం లేదు. అందరికి మంచి జరగాలి అన్నారు. అందరితో మంచిగా ఉండాలి...అందరూ బాగుండాలి అన్నారు. చంద్రబాబు చేస్తున్న కృషికి తన అభినందనలు అంటూ...ఎలాంటి విషయాలు ఇక మనసులో పెట్టుకోకూదన్నారు. ఈ స్పీచ్ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర రావు ను చంద్రబాబు వేదికగా మీదే గట్టిగా ఆలింగనం చేసుకోవటంతో ఈ సభకు హాజరు అయిన వాళ్లు కేరింతలు కొట్టారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

Next Story
Share it