కెసీఆర్ ప్రకటన..ఏపీలో పాలనకు అద్దం పడుతోంది
ఏపీ పాలనకు సంబంధించి టీఆర్ఎస్ అదినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. తెలంగాణలో వెలుగులు.. ఏపీలో చీకట్లు అంటూ కేసీఆర్ ప్రకటన ఏపీలో పాలనకు అద్దం పడుతోందన్నారు. ఏపీని డ్రగ్స్‌కు అడ్డాగా మార్చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జాతీయ స్థాయిలో చైతన్యం కోసమే ఢిల్లీ యాత్ర అని చెప్పారు. రాష్ట్రపతి ముందు నాలుగు ప్రధాన డిమాండ్లు ఉంచామని తెలిపారు. అమ్మ ఒడి వద్దు.. మా బడి ముద్దు అంటూ.. విద్యార్థులు నినాదాలు చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ తాయిలాలు ఇంకెన్నో రోజులు పనిచేయవన్నారు. వాలంటీర్లపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ ఓటమి ఖాయమన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో జగన్ సర్కారు తీరు ఏ మాత్రం సరిగాలేదన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల బడిలో ఉండాల్సిన పిల్లలు..బజారున పడ్డారని ఆరోపించారు. ఎయిడెడ్ విద్యావిదానాన్ని నిర్వీర్యం చేస్తూ పేదల జీవితాలతో ఆడుకోవటం సరికాదన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరారు. 150 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎయిడెడ్ వ్యవస్థను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్ధులను భవిష్యత్ ను నాశనం చేసే హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు.