ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?!
రాజకీయ నాయకులు చాలా మంది సెంటిమెంట్లు బాగా నమ్ముతారు. అందుకే స్వామీజీల దగ్గరకు కూడా వెళుతుంటారు. తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్ని సెంటిమెంట్స్ బలంగానే నమ్ముతారు. అందుకే గతంలో పార్టీ కార్యాలయంతో పాటు అధికారంలో ఉన్న సమయంలో సచివాలయంలో కూడా వాస్తు మార్పులు చేయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగు దేశం నాయకులు కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. చంద్రబాబు ఆదివారం హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలు...సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని ఇప్పటికే నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ, బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికోసం చంద్రబాబు 2014 ఎన్నికల ముందు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దీనిపై అప్పటిలో సొంత పార్టీ నేతలతో పాటు చాలా మంది చంద్రబాబు నిర్ణయాన్ని తప్పు పట్టారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నిర్ణయం సరైనదే అని ప్రూవ్ అయింది. చంద్రబాబు ఎవరో ఏదో అనుకుంటారు అనే అంశం కంటే తనకు రాజకీయంగా ఏది లాభం చేస్తుంది అనే అంశంపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు అనే విషయం తెలిసిందే.
ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు మార్లు చంద్రబాబును అయన నివాసంలో కలిసి చర్చించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఈ సారి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దీంతో పాత సెంటిమెంట్ పునరావృతం అవ్వటం ఖాయం అని..వచ్చే ఎన్నికలో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించటం పక్కా అని తెలుగు దేశం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ సర్కారుపై వివిధ వర్గాల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు ఇది కూడా సెంటిమెంట్ గా కలిసి వస్తుంది అని లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఈ సెంటి మెంట్ ఏ మేరకు పనిచేస్తుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ లు కలిసి ఎన్నికల్లో పాల్గొన్నాయి. అయితే జనసేన అప్పుడు పోటీ చేయకుండానే టీడీపీ, బీజేపీ కి మద్దతు ప్రకటించింది. ఈ సారి మాత్రం టీడీపీ, జనసేనలు కలిసి పోటీలో ఉండబోతున్నాయి. టీడీపీ రాజకీయంగా నిలదొక్కుకోవాలి అంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. మరో వైపు అటు అసెంబ్లీ తో పాటు ఇటు బయటకూడా జనసేన తన ఉనికిని కాపాడుకోవాలి అంటే పొత్తులో భాగంగా తీసుకునే సీట్ల లో కొన్ని అయినా గెలిచి తన సత్తాను చాటుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఆ పార్టీ ది కూడా.