Telugu Gateway
Andhra Pradesh

జగన్ అవినీతి సెకి ఒప్పందానికి ...బాబు..పవన్ రాజముద్ర

జగన్ అవినీతి సెకి ఒప్పందానికి ...బాబు..పవన్ రాజముద్ర
X

సెకి విద్యుత్ కొనులుకు ఏపీ ఈఆర్ సి గ్రీన్ సిగ్నల్

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఎంత సేపూ ప్రధాని మోడీ భజన తప్ప...ఆంధ్ర ప్రదేశ్ జనం గురించి పట్టించుకోరా?. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాదిస్తానన్న జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు అడగటం తప్ప ఏమీ చేయలేము అంటూ హాండ్స్ అప్ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఈ విషయాన్ని మోడీ దగ్గర అడిగే సాహసం కూడా చేయటం లేదు. ప్రత్యేక హోదా అడగలేకపోతున్నారు సరే ..ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపై అదనంగా పడే లక్ష కోట్ల రూపాయల భారాన్ని కూడా తప్పించ లేకపోతే...ఈ విషయాన్ని మోడీ దగ్గర ప్రస్తావించలేకపోతున్నారు అంటే వీళ్ళ గురించి ప్రజలు ఏమి అనుకోవాలి. మాట్లాడితే ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలను తాము తప్ప ఎవరూ కాపాడలేరు అనే కలరింగ్ ఇస్తారు.

కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి వచ్చే 25 సంవత్సరాల్లో ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడినా సరే మేము మౌనంగానే ఉంటాం అన్నట్లు ఉంది వీళ్లిద్దరి తీరు. జగన్ హయాంలో సెకి తో కుదిరిన ఒప్పందం వల్ల ప్రజలపై లక్ష కోట్ల రూపాయల మేర భారం పడుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది టీడీపీ నేతలు...ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. చంద్రబాబు విజన్...దూరదృష్టి చూసే తాను ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు అసెంబ్లీ లోపల ...బయట కూడా పదే పదే చెపుతుంటారు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకుంటే దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయల మేర నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి ప్రజల నెత్తిపై లక్ష కోట్ల రూపాయల భారం వేయటానికి సిద్ద పడ్డారు. లక్ష కోట్ల రూపాయల భారానికి జగనే కారణం అని రాజకీయ విమర్శలు చేయాలి..దాన్ని సరిదిద్దే అవకాశం ఉన్నా చేయకుండా అదానీ కంపెనీలకు వేల కోట్ల రూపాయల మేర మేలు చేసి పెట్టే సెకి ఒప్పందాన్ని కొనసాగించాలి.

ఇదేనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ప్లాన్. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025 -2026 లో ప్రజలపై ఎలాంటి విద్యుత్ భారం మోపటం లేదు అని ప్రకటించారు. ఈ మేరకు నూతన టారిఫ్ ప్రకటించారు. ఇది మంచిదే. కానీ ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం మోపే సెకి నుంచి విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్ సి) ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని డిస్కం లు అన్నీ కూడా సెకి నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర విద్యుత్ వస్తుందో వివరాలు అందచేయగా...సెకి విద్యుత్ కొనుగోలుకు ఈఆర్ సి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జగన్ చేసుకున్న అక్రమ..అవినీతి ఒప్పందానికి అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అన్న మాట. ఒక్కో యూనిట్ ను గతంలో చేసుకున్న ఒప్పందం 2 .49 రూపాయల లెక్కనే కొనుగోలు చేయనున్నారు. అంటే ఈ ఒప్పందంలో ఎలాంటి మార్పులు లేవు అనే విషయం స్పష్టం అయింది.

Next Story
Share it