Telugu Gateway
Andhra Pradesh

లక్షల కోట్ల స్టీల్ కంపెనీల అధినేతలకూ కూడా వెసులుబాట్లు

లక్షల కోట్ల స్టీల్ కంపెనీల అధినేతలకూ కూడా వెసులుబాట్లు
X

రెండు దశల్లో లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే కంపెనీ రాయితీ ధరపై ఇచ్చిన రెండు వేల ఎకరాల భూమికి కూడా ఒకే సారి డబ్బులు కట్టలేదా?. ఇందులో కూడా తమకు వాయిదాలు కావాలని కంపెనీ కోరటం..మీరు అడిగితే మేము కాదంటామా అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని సర్కారు వాటికి ఓకే చేయటం జరిగిపోయాయి. చంద్రబాబు నాయుడు సామాన్య, మధ్య తరగతి ప్రజల విషయంలో ఎంత సానుకూలంగా ఉంటారో చెప్పటం కష్టం కానీ..పారిశ్రామిక వేత్తలు..బడా బడా కాంట్రాక్టర్లు మాత్రం ఏది అడిగితే అది చేసిపెట్టడానికి మాత్రం ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. రాష్ట్ర సంపదను..వనరులను ప్రైవేట్ కంపెనీలకు ఉదారంగా అప్పగించి వాళ్ళతో నిత్యం విజన్ ఉన్న నాయకుడిగా కీర్తింప చేసుకోవటం ఆయనకు ఎప్పటినుంచో అలవాటు అన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం చూసిన అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు.

ఎందుకంటే ఆ కంపెనీ అలాంటిది మరి. ఆర్సెలర్ మిట్టల్ సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. మరో కంపెనీ నిప్పన్ స్టీల్ ప్రమోటర్ల సంపద కూడా అంతే. ఈ రెండు కంపెనీలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ లో ని అనకాపల్లి జిల్లాలో రెండు దశల్లో కలిపి మొత్తం కోటి డెబ్భై లక్షల టన్నుల సామర్ధ్యం తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంది. ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ మొత్తం పెట్టుబడి లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని చెపుతున్నారు. ప్రతిపాదిత యూనిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రేట్లతో అంటే ఎకరా 51.39 లక్షలతో మొత్తం 2080 ఎకరాలు కేటాయించింది. అంతే కాదు ఈ కంపెనీకి పదిహేను సంవత్సరాల పాటు ఎస్ జీఎస్టి మిహాయింపుతో పాటు ఇతర రాయితీలు కూడా ఎన్నో ఇచ్చారు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంస్థకు భారీ ప్యాకేజ్ ప్రకటించారు. ఇవి చాలవన్నట్లు కంపెనీ ఇప్పుడు భూమి ధర మొత్తాన్ని ఒకే సారి కాకుండా పలు విడతల్లో చెల్లించటానికి అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ప్రభుత్వం కేటాయించిన భూమికి కంపెనీ 1068 కోట్ల రూపాయలు చెల్లించాలి. మొదటి విడతగా 450 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే మిగిలిన మొత్తాన్ని మాత్రం తొమ్మిది శాతం వార్షిక వడ్డీ తో మూడు విడతల్లో చెల్లించటానికి అనుమతి ఇచ్చారు. దీంతో పాటు అలాట్ మెంట్ లెటర్ లో ఉన్న నష్టపరిహారం నిబంధన తొలగించాలని కంపెనీ కోరగా దీనికి కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. మరో వైపు ఈ భూమిని ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ ల అనుబంధ సంస్థలకు బదలాయించటానికి కూడా అనుమతి ఇచ్చారు. అయితే ఈ అనుబంధ సంస్థల్లో ప్రధాన కంపెనీ వాటా 51 శాతం పైన ఉండాలని పేర్కొన్నారు. జూన్ 19 న ముఖ్యమంత్రి చంద్రబాబు అద్యక్షతన జరిగిన ఎస్ఐ పీబి సమావేశంలో ఈ ప్రతిపాదనలు అన్నిటికి ఓకే చేశారు. తాజాగా దీనికి సంబదించిన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.

Next Story
Share it