అవినీతి ర్యాంకింగ్స్ లో రాయలసీమ మంత్రికి సెకండ్ ప్లేస్ !

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సర్వేలు చేయించటం ..ర్యాంకింగ్ లు ఇవ్వటం అంటే మహా సరదా అని చెపుతారు టీడీపీ నేతలు. పరిపాలనకు సంబంధించి కూడా ఆయన మంత్రుల దగ్గర నుంచి ఐఏఎస్ అధికారుల పని తీరు విషయంలో కూడా ర్యాంకింగ్ లు ఇస్తుంటారు. ఇటీవల మంత్రులు తమ శాఖకు చెందిన ఫైల్స్ ను ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు అనే అంశంపై ర్యాంకింగ్ లు ఇచ్చారు...దీనిపై మీడియా లో కూడా ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇది ఒక కోణం అయితే అవినీతి విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లోని మంత్రుల్లో ఎవరి ర్యాంకింగ్ ఎంత అన్న అంశంపై టీడీపీ నేతల్లోనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతిలో కూరుకుపోయింది అనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. చాలా మంది మంత్రులు తమ తమ శాఖలతో పాటు ఇతర శాఖల వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు టీడీపీ నేతలే చెపుతున్నారు.
అయితే సొంత శాఖ కాకుండా ఇతర శాఖల్లో కూడా జోక్యం చేసుకునే ఛాన్స్ అందరికీ లేదు...అది కేవలం అధిష్ఠానం అండదండలు ఉన్న కొంత మందికి మాత్రమే ఈ ప్రత్యేక సౌకర్యం ఉంది. కూటమి ప్రభుత్వంలోని టాప్ త్రీ ప్లేసులను పక్కన పెట్టి కేవలం మంత్రుల లెక్కలను చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మొత్తం ప్రభుత్వంలో అవినీతి విషయంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్లు టీడీపీ నేతలే చెపుతున్నారు. పైగా ఆయన ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఈ మధ్య కాలంలో అత్యంత ఇష్టుడిగా మారిపోయారు కూడా. ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా..ఆరోపణలు వచ్చినా కూడా ఎవరూ కిమ్మనరు. దీంతో ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన ఆడిందే ఆట..పాడిందే పాటగా మారింది. ఇప్పటికే ఆరు చేతులతో సంపాదిస్తున్న రాజయలసీమకు చెందిన మంత్రికి అవినీతి విషయంలో సెకండ్ ప్లేస్ వచ్చింది అని టీడీపీ నేతలు వెల్లడించారు. ఆయన తన జిల్లాలో ఏర్పాటు అయ్యే అన్ని పవర్ ప్రాజెక్ట్ ల నుంచి కూడా భారీ ఎత్తున వసూళ్లు చేస్తున్నారు అని..ఆయన అనుమతి లేకుండా పనులు ముందుకు సాగే పరిస్థితి జిల్లాలో లేదు అని చెపుతున్నారు. అంతే కాదు తమ అస్మదీయులకు ఆ విద్యుత్ ప్రాజెక్ట్ ల నుంచి పనులు ఇప్పించి అందులో కూడా ప్రయోజనం పొందుతున్నారు అని టీడీపీ నేతలు వెల్లడించారు. అంతే కాకుండా తన శాఖలో చేసే పనుల విషయంలో ఒక వైపు స్వకార్యం...మరో వైపు స్వామి కార్యం కూడా చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఒక్క పవర్ ప్రాజెక్ట్ లు అనే కాదు...జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్ ల తో పాటు అన్నిటిలో ఆయన వాటా ఆయనకు ఇవ్వాల్సిందే.
కీలక నేతలను బుట్టలో వేసుకోవటంలో ఆయనకు ఉన్న విద్య మొత్తం క్యాబినెట్ లో ఎవరికీ లేదు అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు అంటే ఆయన టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఆయన మాటలు వింటే ఇంత నిజాయతీపరుడా అనిపించేలా ఉంటాయి...కానీ తెరవెనక చేసే పనులు చూస్తే మాత్రం ఎవరైనా అవాక్కు అవ్వాల్సిందే. ఫస్ట్, సెకండ్ ప్లేస్ ల తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మరో మంత్రికి అవినీతి ర్యాంకింగ్ విషయంలో మూడవ ప్లేస్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఆయన శాఖలో రాజ్యాంగేతర శక్తుల జోక్యం ఎక్కువగా ఉన్నా కూడా ఆయన వాటా ఆయనకు దక్కనిదే ఆ శాఖలో ఫైల్ ముందుకు కదలదు అని చెపుతున్నారు. ఇక్కడ పనులు చాలా సాఫీగా పెద్ద హడావుడి లేకుండా సాగిపోతాయి. గుట్టుగప్పుడు కాకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. రాజధానికి అనుకునే ఉండే జిల్లాకు చెందిన పవర్ ఫుల్ మంత్రికి అవినీతి విషయంలో నాల్గవ స్థానం దక్కినట్లు చెపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన శాఖలో అసలు మంత్రి కంటే ఇతరుల జోక్యం ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం అని...ఈ ర్యాంకింగ్ లు ఖరారు చేసిన టీడీపీ నేతల్లో సాగుతున్న చర్చ. టీడీపీ నేతల్లో పెద్ద ఎత్తున ప్రచారం లో ఉన్న టాప్ ఫోర్ అవినీతి మంత్రుల కథ ఇదే. వీళ్ళతో పాటు మరి కొంత మంది మంత్రులపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నా ర్యాంకింగ్స్ లో వీళ్ళు మాత్రమే మొదటి నాలుగు స్థానాలను దక్కించుకున్నట్లు టీడీపీ నేతలు చెపుతున్నారు.



