Telugu Gateway
Andhra Pradesh

అసెంబ్లీలో చంద్రబాబు అసాధారణ చర్య

అసెంబ్లీలో చంద్రబాబు అసాధారణ చర్య
X

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో అసాధారణ చర్యకు దిగారు. సభలో ఆవేశంలో ఊగిపోవటమే కాకుండా..ఏకంగా పోడియం వద్దకు పోయి కింద కూర్చున్నారు. ఓ ప్రతిపక్ష నేత ఇలా చేయటం గత 25 సంవత్సరాల్లో బహుశా ఇదే మొదటి సారేమో. ప్రతిపక్షాలు పోడియాన్ని చుట్టుముట్టడం..గొడవ చేయటం చాలా కామనే అయినా..ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వ్యక్తి మాత్రం ఎప్పుడూ పోడియంలోకి రావటం..దర్నాలకు రావటం జరగదు. కానీ చంద్రబాబు చర్య మాత్రం అనూహ్యమే అని చెప్పాలి. రైతులకు అందజేసే తుఫాను నష్ట సాయం అంశంపై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదనే కారణంతో చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయారు. అయితే అధికార పార్టీ మాత్రం టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడిన తర్వాత దానికి ప్రభుత్వం సమాధానం చెప్పిందని..మద్యలో చంద్రబాబు జోక్యం చేసుకుని వివాదం లేవనెత్తారని చెబుతోంది. చంద్రబాబు తీరుపై సీఎం జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు తన వయసుకు తగ్గట్టుగా కూడా వ్యవహరించడం లేదని విమర్శించారు.

సభలో మాట్లాడేటప్పుడు కనీస అవగాహన ఉండాలని సూచించారు. టీడీపీ సభ్యుడు లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందని వివరించారు. ఒకసారి క్లారిటీ ఇచ్చాక మళ్లీ అదే అంశంపై మాట్లాడటం సరికాదన్నారు. సభలో చర్చ జరగకుండా గందరగోళం సృష్టించాలని ప్రయత్నిస్తున్నట్లు వైసీపీ సభ్యులు విమర్శించారు. సభలో చర్చ సాగకుండా అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులను ఈ రోజు సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేశారు. చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ సస్పెండ్ అయ్యారు. సస్పెండ్అయిన వారిలో బాల వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు, సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, మంతెన రామరాజు, అచ్చెన్నాయుడు, బీ అశోక్, పయ్యావుల కేశవ్, సత్యప్రసాద్‌, జోగేశ్వరరావు, బుచ్చయ్య చౌదరి తదితరులు ఉన్నారు.

Next Story
Share it