సీఎం..డీజీపీ కలసి చేయించిన దాడి ఇది
ఏపీలో తెలుగుదేశం ప్రధాన కార్యాలయంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. పార్టీ ఆఫీసులో దాడి ఘటనను పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. డీజీపికి ఫోన్ చేసినా స్పందించలేదని మండిపడ్డారు. ఏపీలో రాజ్యప్రాయోజిత హింస నడుస్తోంధని ద్వజమెత్తారు. సీఎం, డీజీపీ కలిసి ఈ దాడి చేయించారు. ఇది పులివెందుల రాజకీయం కాదు.దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడి చేయించారన్నారు. డ్రగ్ మాఫియా కేంద్రంగా ఏపీని మార్చారని ఆరోపించారు. డ్రగ్ మాఫియాకు ఒత్తాసు పలుకుతారా? అని ప్రశ్నించారు. మనల్ని మనం కాపాడుకుని..ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అని కార్యకర్తలకు చెబుతున్నా అని ప్రకటించారు. 'టీడీపీ ఆఫీసుపైనే దాడి చేశారంటే ఇక ప్రజలు ఓ లెక్కా వీళ్ళకు. కరెంట్ ఛార్జీలు పెంచితే మేం మాట్లాడకూడదా?. ఇది మా వ్యక్తిగత పోరాటం కాదు..ప్రజలు కూడా ముందుకు రావాలి.
ఇది స్టేట్ టెర్రరిజం. మనల్ని కాపాడాల్సిన వ్యవస్థ పక్కదారి పట్టింది. ఇది భావితరాల సమస్య. డీజీపీ ఆఫీస్ పక్కన దాడి జరిగితే డీజీపీ బాధ్యత లేదా? ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిలైంది. రాష్ట్రంలో 356 సెక్షన్ పెట్టమని కోరటం తప్పుకాదు. వాస్తవానికి మేం దీనికి పూర్తిగా వ్యతిరేకం. కానీ పరిస్థితి చూసి ఈ డిమాండ్ చేయాల్సి వస్తోంది. రౌడీలను తీసుకుని వచ్చి తమాషాలు చేస్తారా. నేను రౌడీలకు..మాఫియాకు భయపడను. ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారని..ఇది 28శాతం మేర ఉందని సర్వే వచ్చింది' అని అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందన్నారు. చేతనైతే డీజీపీ లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేయాలని..చేతకాకపోతే ఇంటికి పోవాలన్నారు. ఏపీలో పలు చోట్ల టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్ళపై దాడులకు తెగపడ్డారన్నారు.బుధవారం నాడు రాష్ట్ర బంద్ కు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు, ప్రజలు తమకు సహకరించాలన్నారు.