Telugu Gateway
Andhra Pradesh

చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం

చంద్ర‌బాబు సంచ‌ల‌న  నిర్ణ‌యం
X

సీఎం అయితేనే మ‌ళ్ళీ స‌భ‌లో అడుగుపెడ‌తా

ఇది గౌర‌వ స‌భ కాదు..కౌర‌వ స‌భ‌

నా కుటుంబ స‌భ్యుల‌నూ అవ‌మానిస్తున్నారు

మీడియా స‌మావేశంలో క‌న్నీరు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో శుక్ర‌వారం నాడు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార‌, విప‌క్ష తెలుగుదేశంల మ‌ధ్య జ‌రిగిన వాద‌న‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు అక‌స్మికంగా సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఇది గౌర‌వ స‌భ కాదు..కౌర‌వ స‌భ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతే కాదు..తాను సీఎంగానే మ‌ళ్ళీ స‌భ‌లో అడుగుపెడ‌తాన‌ని..త‌న‌కు ఈ రాజ‌కీయాలు అవ‌స‌రం లేదంటూ ఆవేశంగా ప్ర‌క‌టించారు. మీకు న‌మ‌స్కారం..ప్ర‌జ‌లంద‌రికీ విజ్ణ‌ప్తి చేస్తున్నా..న‌న్ను అవ‌మానిస్తున్నారు..నిండు మ‌న‌స్సుతో ఆశీర్వ‌దించండి అంటూ ప్ర‌క‌టించి అసెంబ్లీ నుంచి బ‌య‌టకు వ‌చ్చారు. ఈ త‌రుణంలో టీడీపీ, వైసీపీ స‌భ్యులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. టీడీపీ ఏపీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ రోజు నుంచే మీకు ప‌త‌నం ప్రారంభం అయింది..మీకు పత‌నం ప్రారంభం అయింది అంటూ బ‌య‌ట‌కు వెళ్లారు.మ‌ళ్లీ ప్ర‌భుత్వం వ‌చ్చాకే స‌భ‌లోకి వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు. స‌భ‌లో వైసీపీ నేత‌ల ఎటాక్ పై చంద్ర‌బాబు మాట్లాడుతూ 'పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశాం. జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశాం. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నాం. ఏనాడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు నేను చూడలేదు.

అదే విధంగా ఇన్నేళ్లుగా జరగని అవమానాలను భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి.. కుప్పం ఎన్నికల తర్వాత నేను రావాలి. నా ముఖం చూడాలన్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్‌లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విమర్శించారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో.. నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి అవమానించారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా'' అని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.త‌ర్వాత ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ క‌న్నీరు పెట్టుకున్నారు. ప్ర‌జ‌ల్లో తేల్చుకున్న త‌ర్వాతే అసెంబ్లీలోకి వెళ‌తాన‌ని అప్ప‌టివ‌ర‌కూ పోన‌ని చంద్ర‌బాబు త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ విష‌యాన్ని స‌భ‌లోనే చెప్పాల‌నుకున్నాన‌ని..అయితే త‌న‌కు మైక్ ఇవ్వ‌లేద‌న్నారు. ప్ర‌జ‌లు స‌హ‌క‌రిస్తే రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని తెలిపారు. గతంలో శాసనసభలో ఆవేశాలు, కోపాలుండేవని, సభ వాయిదా పడేదని, తిరిగి సమావేశమైన తర్వాత ఎవరిది తప్పయితే వారికి స్పీకర్ చెప్పేవారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

శుక్రవారం శాసనసభలో చంద్రబాబు, చంద్ర‌బాబు కుటుంబసభ్యులను వైసీపీ నేతలు అవహేళన చేస్తూ విమర్శలు చేశారు.అయినా కూడా స్పీక‌ర్, సీఎం స్పందించ‌లేద‌న్నారు. అప్పుడు తన తల్లిని దూషించారు.. ఇప్పుడు తన భార్య విషయం తీసుకువచ్చి అవమానించారంటూ క‌న్నీరు పెట్టుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషించారని చంద్రబాబు తెలిపారు. దీనిపై గట్టిగా వైఎస్‌ను ప్రశ్నించానన్నారు. దీంతో తప్పు జరిగింది.. క్షమించమని అడిగారన్నారు. ఇవాళ వైసీపీ నేతలు నీచ రాజకీయాల కోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారన్నారు. రెండున్నరేళ్లుగా తనను అవమానిస్తూ వస్తున్నారని, ప్రజల కోసం భరిస్తున్నానన్నారు. దేశం కోసం తప్పితే స్వార్థం కోసం ఆలోచించలేదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు తాను చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story
Share it