Telugu Gateway
Andhra Pradesh

నో డిమాండ్స్ ..ఓన్లీ రిక్వెస్ట్స్

నో డిమాండ్స్ ..ఓన్లీ రిక్వెస్ట్స్
X

మాములుగా అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇది ఢిల్లీ లో చక్రం తిప్పే ఛాన్స్. ఎందుకంటే కేంద్రంలోని మోడీ సర్కారు టీడీపీ తో పాటు జెడీయూ మద్దతుపైనే ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. ఎన్ డీఏ లో 12 మంది ఎంపీలతో భాగస్వామిగా ఉన్న జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. ఒక రకంగా ఇది రాజకీయంగా టీడీపీని ఇబ్బంది పెట్టె పరిణామం. అయితే నితీష్ కుమార్ డిమాండ్ ను మోడీ పట్టించుకుంటారా లేదా అన్నది తర్వాత విషయం. కానీ ఇదే ఎన్ డీఏ లో 16 మంది ఎంపీలతో ఉన్న టీడీపీ మాత్రం మోడీ ముందు రిక్వెస్టులు తప్ప ..డిమాండ్స్ పెట్టడం లేదు. అటు మంత్రి పదవుల దగ్గర నుంచి ఇతర విషయాల్లో కూడా మోడీ ఏది ఇస్తే దాన్ని మాత్రమే తీసుకుని చంద్రబాబు ఇప్పుడు తన చక్రానికి స్వీయ బ్రేకులు వేసుకున్నట్లు కనిపిస్తోంది. సహజంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అయినా ఒక పార్టీ పై ఆధారపడి ఉంటే ఆ పార్టీ తన సొంత రాష్ట్రానికి సంబందించిన విషయాల్లో కేంద్రం నుంచి ఎంత మేర ప్రయోజనం పొందాలో ఎంతమేర లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తాయి. గతంలో యూపీఏ హయాంతో పాటు ఎన్ డీఏ ప్రభుత్వాల్లో కూడా అదే జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం మారినట్లు కనిపిస్తున్నాయి. రెండు రోజుల పాటు ఢిల్లీ లో పర్యటించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సారి గతానికి చాలా భిన్నంగా వ్యవహరించారు అనే చర్చ సాగుతోంది.

చంద్రబాబు తొలి సారి ముఖ్యమంత్రి గా ఉన్నప్పటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్ట్ అంచనాల పెంపు అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. అయినా సరే చంద్రబాబు పోలవరం పనులు పునఃప్రారంభానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మోడీని కోరినట్లు వార్తలు వచ్చాయి తప్ప...అంచనాల పెంపు విషయంలో ప్రస్తావించినట్లు ఎక్కడా లేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ లు కలిసి పోటీచేసినందున ఏ విషయంలో కూడా ఈ సారి తొందరపడకూడదు అనే కోణంలోనే చంద్రబాబు వ్యవహరించారు అని ఒక టీడీపీ నేత వెల్లడించారు. కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పాటు అయింది అంటేనే ఆ పార్టీకి మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ ఉండబట్టే. కావాల్సిన మెజారిటీ ఉన్న తర్వాత కూడా మొన్నటి స్పీకర్ ఎన్నికల సమయంలో బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ కి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ మద్దతు కోరటం...అందుకు వైసీపీ అంగీకరించినట్లు మీడియాలో ప్రధానంగా వార్తలు వచ్చాయి. అంటే కావాల్సిన మెజారిటీ ఉన్నా కూడా మోడీ ఇంకా వైసీపీ సాయం తీసుకోవాలని నిర్ణయించారు అంటే ఆయన ఒక కాలు అటు వైపు కూడా వేసి ఉంచారు అనే సంకేతాలు పంపినట్లు అయింది అనే చర్చ కూడా సాగుతోంది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళను కూడా నమ్మకుండా మోడీ తన రాజకీయం తాను చేస్తూనే ఉన్నారు. ఈ విషయాలు అన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు అని...ఏ మాత్రం దూకుడుగా ప్రకటనలు చేయలేదు అనే చర్చ సాగుతుంది.

మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ కు పెరిగిన అప్పులు..ఇతర ఇతర కారణాల వల్ల కేంద్రం నుంచి మద్దతు అవసరం. కీలక భాగస్వామిగా ఉండి కూడా ఎలాంటి డిమాండ్లు పెట్టకుండా సాఫీగా పనులు చేయించుకోవాలి అన్నది చంద్రబాబు ప్రస్తుత ఆలోచనగా చెపుతున్నారు. అయినా కూడా అటు బీజేపీ, కేంద్రంలోని ఎన్ డీఏ సర్కారు ఆంధ్ర ప్రదేశ్ కు సరైన రీతిలో సాయం చేయకపోతే బీజేపీ కే రాజకీయంగా నష్టం అనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే చంద్రబాబు తన వైపు నుంచి డిమాండ్స్ పెట్టకుండా రిక్వెస్ట్ మోడ్ లోనే వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. డిమాండ్లు పెట్టె ఛాన్స్ ఉన్నా కూడా ఆలా కాకుండా రిక్వెస్టులు చేసినా మోడీ ఆంధ్ర ప్రదేశ్ విషయంలో ఏమైనా తేడాగా వ్యవహరిస్తే అప్పుడు చూసుకోవచ్చు అన్నది బాబు ఆలోచనగా చెపుతున్నారు. ఇది ఇలా ఉంటే మహారాష్ట్రతో పాటు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోడీ తన స్టైల్ లో ఇతర పార్టీలను చీల్చి సొంతంగా మెజారిటీ సాధించే దిశగా ప్రయత్నాలు చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.

Next Story
Share it