Telugu Gateway
Andhra Pradesh

విడిగా పోటీకి కూడా చంద్రబాబు సిద్ధం అయ్యారా!

విడిగా పోటీకి కూడా చంద్రబాబు సిద్ధం అయ్యారా!
X

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి కూలబోయి చివరి నిమిషంలో ఆగిందా?. జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలవికాని డిమాండ్స్ తో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విసిపోయారా అంటే అవుననే సమాధానం వస్తోంది టీడీపీ నేతల నుంచి. అధికారంలోకి వచ్చినప్పటి కూడా పవన్ కళ్యాణ్ ఎవరు అడగకపోయినా కూడా మరో పదిహేను సంవత్సరాలు కూటమి అధికారంలో ఉంటుంది అని..ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఉంటారు అంటూ బహిరంగ వేదికలపైనే చెపుతూ వచ్చారు. ఇది జనసేన నాయకులు, క్యాడర్ కు ఏ మాత్రం నచ్చలేదు. అయినా పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఆగలేదు. నిన్నమొన్నటి వరకు బహిరంగంగా ఇవే మాటలు చెపుతూ వచ్చారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైన తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు టీడీపీ అధినేత, చంద్రబాబు ను కూడా షాక్ కు గురి చేసింది అని...ఇలా అయితే కష్టం...కలిసిరాకపోతే ఎవరిదారి వాళ్లదే అని స్పష్టం చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గరకు చర్చల కోసం టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు వెళ్ళినప్పుడు గతంలో చోటు చేసుకున్న వ్యవహారాలను ప్రస్తావించటంతో పాటు చాలా తేడా గా మాట్లాడినట్లు టీడీపీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అదే విషయాన్ని వీళ్ళు చంద్రబాబు ముందు పెట్టారు. ఆ తర్వాత జనసేన తరపున టీడీపీ తో చర్చలకు మంత్రి నాదెండ్ల మనోహార్ తో పాటు మరికొంత నేతలు కూడా వచ్చారు.

జనసేన పెడుతున్న డిమాండ్ లు ఒప్పుకునే పరిస్థితి లేకపోవటంతో టీడీపీ కూడా ఇలా అయితే ఎవరి దారి వాళ్లదే అని స్పష్టమైన సంకేతాలు పంపింది పవన్ కళ్యాణ్ కు. టీడీపీ పై ఒత్తిడి పెంచేందుకు జనసేన ఎమ్మెల్యేలు..ఇతర నేతలతో 40 శాతం సీట్లు కావాలంటూ అధికారికంగా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టించారు. ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాజకీయం కోసం...అధికారం కోసం రాజీ పడే విషయానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ముందు వరసలో ఉంటారు. ఈ విషయంలో పార్టీ నాయకులు...క్యాడర్ ఏమి అనుకుంటున్నారు...ప్రజలు ఎలా ఫీల్ అవుతారు అనే విషయాన్ని కూడా ఆయన పెద్దగా పట్టించుకోరు. అలాంటి చంద్రబాబుకే పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో చికాకు తెప్పించారు అని ఒక టీడీపీ సీనియర్ నేత వెల్లడించారు. టీడీపీ పై ..ప్రభుత్వంపై జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వారీ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒక వైపు చంద్రబాబు పదిహేను ఏళ్ళు సీఎం గా ఉండాలి అని చెపుతూనే 40 ఏళ్ళ టీడీపీ ని తానే నిలబెట్టానని...చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు అందరూ భయపడుతుంటే తమ వాళ్లే బయటకు వచ్చారు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై కీలక నేతలు ఎవరూ నోరు విప్పకపోయినా టీడీపీ అభిమానులు..క్యాడర్ మాత్రం సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఉప ముఖ్యమంత్రి గా ఉండి కూడా మంత్రి వర్గంలోని వాళ్ళ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ వేదికలపై ప్రభుత్వ పరువు పోయేలా మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. ఎవరిని ఒక పట్టాన నమ్మరు...ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు అని చెపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీల మధ్య చోటు చేసుకున్న పరిణామాలు భవిష్యత్ లో ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. గతం కంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు బాగా మారిపోయింది అని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ల వ్యవహారశైలి కూడా అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది.

Next Story
Share it