ప్రెస్ మీట్లు కూడా ఎన్నికల ప్రచారమేనా?!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాడు కు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా..ప్రతిపక్ష నేతగా ఉన్న నాయకుడు కావటంతో ఆయనకు ఒక ఇమేజ్ కూడా ఉంది. విమర్శలు ఎన్ని ఉన్నా కూడా దేశంలోని సీనియర్ నేతల్లో ఆయన ఒకరు. ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కూడా టీడీపీ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. గతానికి బిన్నంగా ఈ సారి బీహార్ ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు కాకుండా ఆయన తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ బీహార్ వెళ్లటం టీడీపీ నేతల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఏపీ కి చెందిన మీడియా కూడా నారా లోకేష్ బీహార్ పర్యటనకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్నికల ప్రచారం అంటే సహజంగా ఎవరైనా బహిరంగ సభలు...ర్యాలీల్లో పాల్గొంటారు. కానీ ఇందుకు భిన్నంగా నారా లోకేష్ బీహార్ వెళ్లి అక్కడ కేవలం ప్రెస్ మీట్ లు మాత్రమే పెట్టారు. దాన్నే ఎన్నికల ప్రచారంగా చెప్పుకున్నారు. ప్రెస్ మీట్ లు పెడితే ప్రజలు ఓట్లు వేస్తారా?.
దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న చంద్రబాబు నాయుడు బీహార్ వెళ్లి ఎన్నికల ప్రచారం చేసినా కలిగే ప్రయోజనమే ఎంతో చెప్పటం కష్టం. ఎందుకంటే అక్కడి రాజకీయాలు..అక్కడి పరిస్థితులు వేరు. అలాంటిది నారా లోకేష్ బీహార్ వెళ్లి అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు...ప్రెస్ మీట్లు పెడితే బీజేపీ కి ఓట్లు పడతాయా అన్న సందేహం టీడీపీ నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రచారం చేశారు అంటే అక్కడ కొంత మంది తెలుగు వాళ్ళు ఉంటారు..వాళ్ళను ప్రభావితం చేస్తారు అనుకోవవచ్చు. కానీ బీహార్ లో అలాంటి పరిస్థితి ఉండదు. అయినా కూడా నారా లోకేష్ బీహార్ వెళ్లి అక్కడ ప్రచారం పేరుతో హడావుడి చేశారు అంటే చంద్రబాబు అండ్ కో తన తనయుడిని జాతీయ స్థాయిలో కూడా ఒక ఇమేజ్ తీసుకువచ్చే ప్రయత్నం మొదలుపెట్టినట్లు ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రతి వారం వచ్చే హైదరాబాద్ లో వాళ్ళ నివాసం ఉండే ప్రాంతంపేరుతో ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నా ఉప ఎన్నికలో మాత్రం అటు జాతీయ స్థాయిలో..ఇటు రాష్ట్ర స్థాయిలో పొత్తులో కొనసాగుతున్న బీజేపీ కి ఓటు వేయమని మాత్రం ఎక్కడా చెప్పలేదు. కానీ నారా లోకేష్ బీహార్ వెళ్లి మరీ బీజేపీ, జె డీయూ అభ్యర్థులకు ఓట్లు వేయాలని...బీహార్ లో మరో సారి ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. ఈ ప్రెస్ మీట్ లు చూసిన వాళ్ళు దీన్ని ఎన్నికల ప్రచారం అంటారా అని కొంత మంది టీడీపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు.



