డీపీజీకి చంద్రబాబు లేఖ
తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీకి మరో లేఖ రాశారు. తాజాగా ఆయన టీడీపీ నేత వంగవీటి రాధా భద్రతకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఈ లేఖ రాశారు. అందులో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భయానకంగా ఉందని పేర్కొన్నారు. బెదిరింపుల, దాడులు పరంపర కొనసాగుతున్నాయని ఆరోపించారు. లేఖలోని ముఖ్యాంశాలు... ' తాజాగా విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధాను టార్గెట్ చేశారు. కొంతమంది తనపై దాడి చేయడానికి తనను వెంబడిస్తూ రెక్కీ నిర్వహించారని రాధ చెప్పారు. పట్టపగలే ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో జంగిల్ రాజ్, గూండా రాజ్ పాలన కొనసాగుతున్న వాస్తవాన్ని ఎత్తిచూపుతున్నాయి.
పారదర్శకంగా విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చూడటం అత్యవసరం. గతంలో జరిగిన చట్టవిరుద్ధమైన, హింసాత్మక సంఘటనలపై ఎటువంటి చర్యలు తీసుకోనందుకే ఇటువంటి సంఘటనలు పదే పదే పునరావృతమవుతున్నాయి. వంగవీటి రాధపై దాడి జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేరస్థులపై తీసుకునే కఠినమైన చర్యలు మాత్రమే గూండా రాజ్ నుండి రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులు రక్షించబడతాయి. వంగవీటి రాధపై రెక్కీ వ్యవహారంపై ఒత్తిడులకు తలొగ్గకుండా త్వరితగతిన, పారదర్శకంగా విచారణ జరిపి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులకు శిక్ష పడేలా చూడాలి' అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.