రాజకీయంగా దుమారం రేపటం ఖాయం

రాజధాని కోసం ఇప్పటికే 33733 ఎకరాల సమీకరణ
ఇప్పుడు అంత కంటే ఎక్కువా?
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులు వేగంగా సాగటానికి అంతా సిద్ధం అయిన వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వమే దీనికి సంబంధించిన సమాచారం బయటకు పంపటంతో ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త దుమారం రేపటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా తూళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లో 44676 ఎకరాలు సమీకరించాలని సర్కారు ప్రతిపాదించింది. రాజధాని కోసం 33733 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం వివిధ కారణాలు చెప్పి ఏకంగా రాజధాని అవసరాల కంటే ఎక్కువగా 44676 ఎకరాలు సమీకరించే దిశగా అడుగులు వేస్తుండటం టీడీపీ నేతలకు సైతం అంతు చిక్కటం లేదు. రాష్ట్రం ఇప్పుడు ఉన్న పరిస్థితిల్లో మళ్ళీ అమరావతిలో కొత్తగా ఇంత భారీ స్థాయిలో భూ సమీకరణ వ్యవహారం ఏ మాత్రం మంచి పరిణామం కాదు అన్నది ఎ టీడీపీ నేతల అభిప్రాయంగా కూడా ఉంది. అయితే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఇవేమి పట్టించుకునే పరిస్థితిలో లేరు అన్నది ఆ పార్టీ నాయకులు చెపుతున్నారు.
తొలి దశలో సమీకరించిన భూమితో పాటు ప్రభుత్వ భూమి కూడా కలుపుకుంటే ఆ మొత్తం ఏకంగా ఏభై వేల ఎకరాల పైనే ఉంది. దీనిపైనే అప్పటిలో పెద్ద ఎత్తున విమర్శలు రాగా ..కొత్తగా కట్టే రాజధానికి ఈ స్థాయిలో భూమి ఉండటం అవసరమే అంటూ వాదనలు తెర మీదకు వచ్చాయి. తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. కాని సద్దుమణిగిన వివాదాన్ని లేపటంతో పాటు రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం...దందా అన్న విమర్శలకు ఊతం ఇచ్చేలా ప్రభుత్వం కొత్తగా తొలి దశలో చేసిన దాని కంటే ఎక్కువగా ఏకంగా 44675 ఎకరాల సమీకరణ ప్రతిపాదనను తెర మీదకు తేవటం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. రాజధాని విస్తరణ..ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో పాటు వివిధ పేర్లు చెప్పి ఈ కొత్త భూ సేకరణకు ప్లాన్స్ రెడీ చేసినట్లు చెపుతున్నారు.
రాజధాని అమరావతి పూర్తి అయిన తర్వాత కూడా అమరావతికి ఎంత మంది వస్తారు...ఈ నూతన రాజధాని ఒక హైదరాబాద్ లాగా...వైజాగ్ లాగా కళకళలాడాలంటే ఎంత సమయం పడుతుంది అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఈ తరుణంలో మళ్ళీ చంద్రబాబు సర్కారు ఇంకా పూర్తి కాని రాజధాని అమరావతి విస్తరణ అంశాన్ని ఇప్పుడే తెరమీదకు తెచ్చి భూ సమీకరణ విషయాన్ని ముందుకు తీసుకురావటం వెనక పెద్ద ప్లానే ఉంది అనే చర్చ సాగుతోంది. అయితే ప్రభుత్వ ప్రతిపాదనుకు రైతుల నుంచి ఏ మేరకు మద్దతు లబిస్తోందో వేచిచూడాల్సిందే. అమరావతి పనులు ఇప్పుడిప్పుడే వేగంగా మొదలు అవుతున్న వేళ ఇలాంటి ప్రతిపాదనలు తెర మీదకు తీసుకురావటం కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం మంచికాదు అని టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.