జగన్ మోడల్ లోనేనా!
ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి సర్కారు కూడా జగన్ ప్రభుత్వ మోడల్ లోనే వెళుతుందా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ కూడా ఈ ట్రెండ్ లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే తొలి సారి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో జాతీయ మీడియా సలహాదారు పోస్ట్ సృష్టించి..ఈ పదవిని దేవులపల్లి అమర్ కు ఇచ్చిన విషయం తెలిసిందే. విచిత్రం ఏమిటి అంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు టీడీపీ లో ఉండి...తెలంగాణాలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు కు ఎంతో సన్నిహితుడుగా పేరున్న రాజ మౌళి అనే రిటైర్డ్ అధికారి ఈ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవటంతో దీనికి సంబంధించిన ఫైల్ వేగంగా కదులుతున్నట్లు చెపుతున్నారు. తెలంగాణాలో ఆయన డిప్యూటీ డైరెక్టర్ గా పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఆయన బిఆర్ఎస్ హయాంలో ఐ అండ్ పిఆర్ డిపార్ట్ మెంట్ లో డైరెక్టర్ గా పనిచేశారు. అప్పటిలోనే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఇప్పుడు మళ్ళీ అదే ఎర్రబెల్లి దయాకర్ రావు అండదండలతో ఏపీ ప్రభుత్వం నుంచి జాతీయ మీడియా సలహాదారు పదవి కోసం ట్రై చేస్తున్నట్లు ఆ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పోస్ట్ ఇవ్వటంతో పాటు తనకు హైదరాబాద్ కేంద్రంగా పని చేసే అవకాశం ఇవ్వాలని రాజ మౌళి కోరుతున్నట్లు చెపుతున్నారు. జాతీయ స్థాయిలో మీడియా మేనేజ్ మెంట్ విషయంలో అధికార తెలుగు దేశం పార్టీ కి ఎంతో మంచి పట్టు ఉంది అనే పేరు ఉన్న విషయం తెలిసిందే. అలాంటి టీడీపీ ఇప్పుడు ఒక జాతీయ మీడియా సలహాదారు పదవిని ఏర్పాటు చేసే పనిలో ఉండటం చర్చనీయాంశగా మారింది. మొన్నటి దావోస్ టూర్ కోసం కూడా ఏపీ ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి అన్ని బిజినెస్ చానెల్స్ లో చంద్రబాబు, నారా లోకేష్ ల ఇంటర్వ్యూ లు వచ్చేలా చేసుకున్నారు. కానీ మీడియా కు నిధుల మంజూరు చేసే సమయంలో మాత్రం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచటం..రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి ప్రచారం చేస్తారు అని చెప్పటం. ఎన్నో సంవత్సరాలుగా అందరూ ఇదే మోడల్ ఫాలో అవుతున్నారు.
కుప్పలు తెప్పలు గా విజయ్ కుమార్ అక్రమాలు!
వైసీపీ హయాంలో సమాచార శాఖ కమిషనర్ గా పని చేసిన తుమ్మా విజయకుమార్ రెడ్డి అక్రమాలు కుప్పలు తెప్పలు గా వెలుగులోకి వస్తున్నట్లు సచివాలయ వర్గాలు చెపుతున్నాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం . జగన్ హయాంలో ఆయన ఫ్యామిలీ కి చెందిన సాక్షి మీడియా గ్రూప్ కు అందరి కంటే ఎక్కువ గా అది కూడా వందల కోట్ల రూపాయల మేర లబ్ది కలిగించినట్లు కూటమి సర్కారు అధికారికంగా అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. దీనిపై విచారణకు కూడా ఆదేశించిన సంగతి తెలిసిందే. విజయకుమార్ రెడ్డి పై యాక్షన్ తీసుకునేందుకు వీలుగా ఫైల్స్ వేగంగా కదులుతున్నాయి.