Telugu Gateway
Andhra Pradesh

పవన్ కు వివరణ ఇచ్చుకున్నట్లు చంద్రబాబు మాటలు!

పవన్ కు వివరణ ఇచ్చుకున్నట్లు చంద్రబాబు మాటలు!
X

ప్రభుత్వ పరువు పోతుంది అంటున్న టీడీపీ నేతలు

స్టూడెంట్స్ స్కూల్ కు.. కాలేజీ కి లేట్ వెళ్లొచ్చు. హీరో సినిమా షూటింగ్ కు కూడా లేట్ వెళ్లొచ్చు. ఎందుకంటే నిర్మాతలు..దర్శకులు అందరూ హీరో ను అంతగా అభిమానిస్తారు కాబట్టి. అక్కడ హీరో కు పెద్దగా సమస్యలేమీ ఉండవు. కానీ జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం నాడు వెలగపూడి సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి లేట్ గా వెళ్లారు అట. ఒక పేపర్ లో 25 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు అని రాస్తే..మరో పేపర్ లో ఆరేడు నిమిషాలు అన్నట్లు రాసుకొచ్చారు. ఒక ఉప ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశానికి లేట్ రావటం అన్నదే విచిత్రం. గతంలో ఎప్పుడూ కూడా ఏ మంత్రి లేట్ గా వచ్చిన సందర్భాలు లేవు , ఉండకూడదు అని కూడా చెప్పొచ్చు. ఎవరికైనా క్యాబినెట్ సమావేశం కంటే పెద్ద పనులు ఏమీ ఉంటాయి. రకరకాల కారణాలతో సమావేశాలకు దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ..లేట్ గా వచ్చిన సందర్భం మాత్రం అరుదు అనే చెప్పాలి. ఏవైనా ఎమర్జెన్సీ పర్యటనలు ఉంటే క్యాబినెట్ సమావేశం ముగియక ముందే సీఎం అనుమతితో వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. క్యాబినెట్ సమావేశం అంటే తేదీ, సమయం వంటి వివరాలు...కొద్దిగా ముందుగా ఎజెండా కూడా మంత్రులకు వెళతాయి.

పవన్ కళ్యాణ్ కాకుండా టీడీపీ కి చెందిన మంత్రి ఎవరైనా క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్లు ఆలస్యంగా వచ్చి ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు ఇప్పటిలాగా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేవారా?. అంటే కచ్చితంగా లేదు అనే చెప్పొచ్చు. మరో సారి ఇలా చేస్తే పదవి పీకేస్తా అనే వారు. పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశానికి లేటుగా రావటం మాత్రమే కాదు..క్యాబినెట్ లో జరిగిన చర్చలకు సంబంధించి వచ్చిన వార్తలు చూస్తే కూడా పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను మంత్రివర్గం మొత్తం ఎండార్స్ చేసినట్లు ఉంది అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది అని టీడీపీ కి చెందిన సీనియర్ మంత్రి ఒక వ్యాఖ్యానించారు. నెల రోజుల్లో అసలైన పోలీసింగ్ ఎలా ఉంటుందో చూస్తారు అని చంద్రబాబు చెప్పినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. అంటే ఇప్పుడు పోలీస్ లు సరిగా పని చేయటం లేదు అనే అభిప్రాయాన్ని ఆయన కూడా అంగీకరించినట్లు అయింది అని చెపుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఆవేదనతో తాను మాట్లాడినట్లు క్యాబినెట్ లో చెప్పారు. ఆవేదన ఉంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్వయంగా క్యాబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తి ఉండొచ్చు.. లేదు అంటే అంతకంటే ముందు సీఎం, హోమ్ మంత్రులతో కలిసి కూడా ఇదే విషయాన్ని చర్చించి ఉండొచ్చు.

కానీ పవన్ కళ్యాణ్ వరసగా రెండు రోజులు పోలీస్ ల గురించి మాట్లాడిన మాటలు మాత్రం ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలా ఉన్నాయని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. క్యాబినెట్ కు లేట్ గా వచ్చినా ...బహిరంగ సభల్లో ఇంకా వైసీపీ నాయకులే రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు అని పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసినా చంద్రబాబు దగ్గర నుంచి టీడీపీ నాయకులూ ఎవరు నోరెత్తలేని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు చంద్రబాబు వివరణ ఇచ్చుకున్నట్లు పరిస్థితి ఉంది అని..మీడియా లో వచ్చిన వార్తలు కూడా ఇవే సంకేతాలను పంపుతున్నాయి అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు బహిరంగంగా చెప్పిన విషయాలనే టీడీపీ అభిమానులు గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా చెపుతున్నారు. అప్పుడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పరువు తీసిన తర్వాత మాత్రం స్పందించారు అని ఒక టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it