Telugu Gateway
Andhra Pradesh

రైతులు సహకరిస్తారా?!

రైతులు సహకరిస్తారా?!
X

అమరావతి పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాదకర ఆట ఆడబోతున్నారా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. రాజధాని కోసం రైతులకు సంబంధించిన భూములు సేకరించిన సమయంలోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కూడా విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం గా మారటంతో చాలా మంది ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా కూడా ఇప్పటికి రాజధాని నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. దీనికి చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిలే కారణం. ఇది అంతా అందరికి తెలిసిన విషయమే. రాజధాని అమరావతి పూర్తి అయిన తర్వాత కూడా అమరావతికి ఎంత మంది వస్తారు...ఈ నూతన రాజధాని ఒక హైదరాబాద్ లాగా...వైజాగ్ లాగా కళకళలాడాలంటే ఎంత సమయం పడుతుంది అన్నదానిపై స్పష్టత లేదు.

కానీ ఈ తరుణంలో మళ్ళీ చంద్రబాబు సర్కారు ఇంకా పూర్తి కాని రాజధాని అమరావతి విస్తరణ...అంతర్జాతీయ విమానాశ్రయం తదితర కారణాలు చెప్పి అమరావతి ప్రాంతంలో మరో 30000 వేల ఎకరాల భూమి సేకరించే దిశగా అడుగులు వేస్తుండటం దుమారం రేపుతోంది. ఈ తరుణంలో ఇలాంటి ప్రతిపాదనలు తెర మీదకు తీసుకురావటం కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం మంచికాదు అని టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడిప్పుడే అమరావతి పనులు పట్టాలు ఎక్కుతున్న వేళ మరో ముప్పై వేల భూసేకరణ అంటే కొత్త వివాదాలను కొనితెచ్చుకోవటమే అనే అభిప్రాయాన్ని ఒక మంత్రి వ్యక్తం చేశారు. కొత్తగా భూసేకరణ సంబంధించి ప్రభుత్వం నుంచి సమాచారం బయటకు రావటం రైతుల్లో మరో సారి ఆందోళనలకు కారణం అయ్యే అవకాశం ఉంది.

ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ఇలా ఉంది. ‘రాజధాని ప్రాంత విస్తరణకు ప్రభుత్వం ఆలోచనలు. ఓవైపు రాజధాని అభివృద్ధి.. మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్దం చేసుకునే దిశగా ఏపీ సర్కార్ అడుగులు. రాజధాని పనులను త్వరలో ప్రారంభించనున్న ప్రభుత్వం. రాజధాని పనులు ప్రారంభమయ్యాక.. విస్తరణ పనులపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టనున్న చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని విస్తరణ కోసం మరింత భూమిని సమీకరించే యోచనలో ఏపీ ప్రభుత్వం. అమరావతి IRR, ORRకి అనుసంధానంగా భూముల సమీకరణకు యోచన. విస్తరణ, భవిష్యత్ అవసరాల నిమిత్తం భూ సమీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ప్రభుత్వం. సుమారు మరో 30 వేల ఎకరాల మేర భూ సమీకరణ అవసరమవుతుందని అంచనా. ప్రస్తుత రాజధాని గ్రామాలు కాకుండా.. మరో 20 గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టాలని యోచన. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం. కొత్తగా హరిచంద్రాపురం,వైకుంఠపురం, వడ్డమాను, ఎండ్రాయి,కార్లపూడి, పెదపరిమి,తాడికొండ, కంతేరు,కాజ,చినకాకాని..గ్రామాలను మలి విడత లో భాగంగా రాజధానికి భూములు సమీకరణ పై సర్కార్...కసరత్తు’ అంటూ సమాచారం బయటకు వచ్చింది.

Next Story
Share it