Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ నాయకుల్లో కలకలం రేపుతున్న గోల్ మాల్ డీల్

టీడీపీ నాయకుల్లో కలకలం రేపుతున్న గోల్ మాల్ డీల్
X

డబ్బుల దగ్గర అంతా ఒక్కటే అంటూ విమర్శలు

‘జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు. నేరస్థులు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో గత ఐదేళ్ళలో చూశాం. ఇష్టానుసారం చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారు. విభజన కంటే జగన్ పాలన వల్లే ఆంధ్ర ప్రదేశ్ కు ఎక్కువ నష్టం జరిగింది. ’ ఇవీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలుకుని ఆ పార్టీ కీలక నేతలు అందరూ చేసిన..చేస్తున్న విమర్శలు . సరే ఇదే నిజం అనుకుందాం కాసేపు. మరి చివరికి కూటమి కూడా ఊహించని రీతిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ లకు కలిపి ఏకంగా 164 సీట్లు ఇచ్చారు. అంటే ప్రజలు ఎంత నమ్మకంతో ఈ పని చేశారు. అయితే ఈ ఫలితాలపై ఎక్కువ ప్రభావం చూపించిన అంశం చంద్రబాబును నమ్మటం అనే మాట కంటే ...జగన్ పై వ్యతిరేకత అన్నదే అత్యంత కీలకమైన అంశం. కారణాలు ఏమైనా ఈ గెలుపు అసాధారణం. మరి ప్రజలు ఇంతగా నమ్మి అధికారం ఇస్తే ఏమి చేయాలి. గతంలో జరిగిన తప్పులను సరిదిద్ది ఖజానాకు నష్టం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా జగన్ ప్రాయోజిత కంపెనీలుగా పేరున్న సంస్థలతో ఒక యువ మంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలకు సెటిల్మెంట్ చేసుకున్నట్లు వచ్చిన వార్తలు టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

ఈ సెటిల్మెంట్ తో పాటు ఆయా కంపెనీల్లో బినామీ వాటాలు కూడా దక్కించుకోవటాని స్కెచ్ వేశారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. జగన్ హయాంలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ తో పాటు ఆ కంపెనీ అనుబంధ సంస్థలకు సంస్థకు...జగన్ సర్కారు అడ్డగోలుగా ..వేల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ది చేకూర్చినట్లు ఆరోపణలు చేశారు. విచిత్రం ఏమిటి అంటే కొద్ది రోజుల క్రితం చంద్రబాబునాయుడు గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ లు దక్కించుకున్న కంపెనీలపై ఎలాంటి చర్యలు ఉండవని ప్రకటించారు. ఈ ప్రకటన వెనక ప్రధాన ఉద్దేశం యువ మంత్రి తెర వెనక కుదుర్చుకున్న డీల్ మహత్యమే ఉంది అన్న చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. ఒకటేమిటి జగన్ ప్రాయోజిత కంపెనీలుగా పేరున్న వాటిపై చంద్రబాబు సర్కారు గతంలో పవర్ ప్రాజెక్ట్ ల పేరుతో వేల ఎకరాల భూములు కట్టబెట్టినా..వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు లు ఇచ్చినా కూడా ఏమి చేయదు అని తేల్చేశారు. అంటే జగన్ చేశారు అని చెపుతున్న అక్రమాలకు చంద్రబాబు మార్క్ ఎండార్స్మెంట్ అన్న మాట.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వై ఎస్ హయాంలో స్టీల్ ప్లాంట్ పేరు చెప్పి ఓబుళాపురం గనులను గాలి జనార్దన్ రెడ్డి కి ఐరన్ ఓర్ లీజులు కట్టబెట్టిన చందంగా ఉంది అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. జగన్ ప్రభుత్వంలో విద్యుత్ ప్రాజెక్ట్ ల రంగంలో అనుభవం లేని సంస్థకు..వేల ఎకరాల భూములతో పాటు ప్రాజెక్ట్ లు అప్పగించినా కూడా ఎలాంటి చర్యలు ఉండవని ప్రకటించారు అంటే ఈ డీల్ వెనక పెద్ద మొత్తంలో చేతులు మారాయనే ప్రచారం నిజం అని తేలిపోయినట్లు అయింది అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. సో చంద్రబాబు మాటలు కేవలం పైకి మాత్రమే తప్ప..గత ఐదేళ్ల కాలంలో ప్రజల సొమ్మును ఇష్టానుసారం దోచేసిన కంపెనీలు అన్ని సేఫ్ అని తేల్చటంతో ప్రజలకు ఎలాంటి సంకేతం వెళుతుంది అనే చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. ప్రజలు పవర్ ఇచ్చింది పవర్ కంపెనీల నుంచి వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికే అన్న చందంగా ఆ యువ మంత్రి తీరు ఉంది అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it