వైజాగ్ స్టీల్ వంద శాతం అమ్మేస్తాం

పెట్టుబడులు ఉపసంహరణలో భాగంగానే వైజాగ్ స్టీల్ లో వంద శాతం వాటాల విక్రయం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ ను అడ్డుకోవాలనే అధికారం ఉద్యోగులకు ఉండదని స్పష్టం చేసింది. అవసరం అయితే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది. సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ దీనిపై వేసిన పిటీషన్ రాజకీయ కారణాలతోనే అని కేంద్రం పేర్కొంది. ఆయన గత ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా పోటీచేశారని తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ లో పలు అంశాలను ప్రస్తావించింది. కేంద్రం తరపున కార్యదర్శి ఆర్కే సింగ్ ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే.. స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జరగనుందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
కేంద్రం పూర్తిస్థాయిలో పెట్టుబడులు ఉపసంహరించాలని కేబినెట్ కమిటీ నిర్ణయించడంతో ఈ ఏడాది జనవరి 27నే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవహారాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుందని, ఇటువంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఆర్కే సింగ్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇలాంటివాటిపై గతంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందన్నారు. కేంద్ర కేబినెట్ కమిటీలో ప్రధాని, ఆర్థికమంత్రి, హోంమంత్రి, ఉక్కుమంత్రి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, పెట్రోలియం మంత్రి సభ్యులుగా ఉన్నారన్నారు. పూర్తి అర్హత కలిగిన అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.