Telugu Gateway
Andhra Pradesh

విశాఖ స్టీల్ పై సంచలన విషయాలు చెప్పిన ధర్మేంద్రప్రదాన్

విశాఖ స్టీల్ పై సంచలన విషయాలు చెప్పిన ధర్మేంద్రప్రదాన్
X

స్టీల్ ప్లాంట్ భూముల్లోనే పోస్కో ప్లాంట్

ఇది అంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా?

ఏపీలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యవహారం దుమారం రేపుతోంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో పార్టీలు అన్నీ పాల్గొంటున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ సంచలన విషయాలు వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. 2019 అక్టోబర్ లోనే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) భూముల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పోస్కో ఆసక్తి చూపించింది. ఈ మేరకు ఆర్ఐఎన్ఎల్, పోస్కోల మధ్య కట్టుబడి ఉండాల్సిన అవసరంలేని ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఉమ్మడి సంయుక్త గ్రూప్ (జెడబ్ల్యూజీ) ఏర్పాటు చేశారు. షేర్ హోల్డింగ్ వ్యవహారం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. అయితే ఎంవోయు ప్రకారం పోస్కో కనీసం 50 శాతం వాటా తీసుకోవాలని కోరుకుందని తెలిపారు. అయితే భూమి విలువ ఆధారంగా ఆర్ఐఎన్ ఎల్ కు ఎంత వాటా వస్తుందనే అంశం పై ఇంకా ఓ అంచనాకు రాలేదన్నారు. దక్షిణకొరియా రాయబారితోపాటు హ్యుండయ్, పోస్కో సంయుక్త బృందం ఆర్ఐఎన్ ఎల్ ప్లాంట్ ను సందర్శించింది.

2018 అక్టోబర్ లో జరిగిన ఆర్ఐఎన్ఎల్, ఎన్ఎండీసీ, స్టీల్ మంత్రిత్వ శాఖ అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత 2019 జులై9న, అదే ఏడాది సెప్టెంబర్ 23న, 2020 ఫిబ్రవరి 20న కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశంపై చర్చలు సాగించినట్లు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే పోస్కో ప్రతినిధులు తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కూడా సమావేశం అయినట్లు పత్రికల్లో ప్రధానంగా వార్తలు వచ్చాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇది అంతా జరిగే అవకాశం లేదు. విశాఖ స్టీల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా కూడా పోస్కో ప్రతినిధులు సీఎం జగన్ తో సమావేశం కావటంతో ప్రభుత్వానికి ముందు నుంచి ఈ విషయం తెలుసనే అంశం తాజాగా తెరపైకి వచ్చింది.

Next Story
Share it