Telugu Gateway
Andhra Pradesh

అయినా కేంద్ర బడ్జెట్ పై పొగడ్తలు

అయినా కేంద్ర బడ్జెట్ పై పొగడ్తలు
X

కేంద్ర బడ్జెట్ లో ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ కు పెద్దగా ప్రయోజనం కలిగించే అంశాలు ఏమీ లేవు. ఇప్పటికే ఆమోదం తెలిపిన పోలవరం తో పాటు ఇతర అంశాలు తప్ప ...ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా పదే పదే ప్రస్తావిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆయన పలు మార్లు కేంద్రం వద్ద ప్రస్తావించారు. దావోస్ నుంచి నేరుగా ఢిల్లీ చేరుకొని కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో ఇదే అంశంపై చర్చలు జరిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ వివిధ రకాల కారణాలతో తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంది అని చెపుతూ కూడా చంద్రబాబు ఏకంగా ఎనభై వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బనకచర్ల ప్రాజెక్ట్ ను తెర మీదకు తీసుకువచ్చారు. ప్రపంచ బ్యాంకు దేశంలో వివిధ ప్రాజెక్ట్ ల కోసం ఇచ్చిన నిధుల్లో ఏభై వేల కోట్ల రూపాయల మేరకు కేంద్రం వద్ద మిగులు గా ఉన్నాయని..ఇందులో కేంద్రం తొలి విడత 40000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ కు ఇవ్వటానికి అంగీకరించినట్లు ప్రచారం చేశారు. కానీ సీన్ కట్ చేస్తే కేంద్రం బడ్జెట్ లో చంద్రబాబు కలల ప్రాజెక్ట్ గా ప్రచారం చేసుకున్న బనకచర్లకు హ్యాండ్ ఇచ్చారు.

దీంతో పాటు వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ ల ఊసు ఎత్తలేదు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ కి బడ్జెట్ లో ఏ మాత్రం ప్రాధాన్యత దక్కలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆ రాష్ట్రంపై ప్రత్యేక ప్రేమ చూపించి...ఆంధ్ర ప్రదేశ్ విషయాన్ని విస్మరించారు అని చెపుతున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు కూడా. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్ పై వరాల వర్షం కురిపించారు...ఎన్డీయే లో మరో ప్రధాన పిల్లర్ గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ను ఎందుకు దారుణంగా విస్మరించారు అంటూ ఆయన ప్రశ్నించారు. గతంలో అమరావతి కి ప్రపంచ బ్యాంకు నుంచి 15000 కోట్ల రూపాయల రుణం ఇప్పిస్తున్న విషయాన్ని బడ్జెట్ లో పెట్టిన సంగతి తెలిసిందే.

విచిత్రం ఏమిటి అంటే కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు పెద్దగా ప్రయోజనం కలిగే అంశాలు ఏమీ లేకపోయినా కూడా దీనిపై ప్రశంసలు కురిపిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ప్రజలకు మేలు చేకూర్చే బడ్జెట్‌ను నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. వికసిత్ భారత్‌ విజన్‌ను ప్రతిబింభించేలా బడ్జెట్‌ ఉందని ప్రశంసించారు. మహిళా, పేదల, యువత, వ్యవసాయదారుల సంక్షేమానికి బడ్జెట్ పెద్దపీట వేసింది అంటూ కొనియాడారు. రానున్న ఐదేళ్లలో ఆరు కీలక రంగాల్లో అభివృద్ధికి ఈ బడ్జెట్ మార్గనిర్దేశనం చేస్తోందన్నారు. మధ్యతరగతి వర్గానికి ట్యాక్స్ రిలీఫ్‌, ఈ బడ్జెట్‌లో వచ్చిన అదనపు ప్రయోజనం అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బడ్జెట్‌ను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Next Story
Share it