ఇదే భూములతో అప్పుడు సింగపూర్ చేస్తానన్నారు కదా మరి!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫస్ట్ టర్మ్ లో..అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి సారి సీఎం అయినప్పుడు రాజధాని అమరావతి విషయంలో రంగుల ప్రపంచం చూపించారు. ఎప్పుడూ ఆయన సింగపూర్ రేంజ్ నుంచి తగ్గే వారు కాదు. ఒక్క సింగపూర్ మాత్రమే కాకుండా ఇస్తాంబుల్ తో పాటు ఎన్నో దేశాలు..ప్రముఖ నగరాల పేర్లు ప్రచారంలో పెట్టారు. అలాంటి రాజధాని ఆంధ్ర ప్రదేశ్ లో కట్టనున్నట్లు చెపుతూ వచ్చేవాళ్ళు. కారణాలు ఏమైనా ఫస్ట్ టర్మ్ లో తాత్కాలిక భవనాలతోనే ఆయన పదవీకాలం ముగిసిపోయింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో పాటు ఇదే రాజధాని అని అక్కడ ఇల్లు, అపార్ట్మెంట్స్ తో పాటు భూములు కొనుగోలు చేసిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇటీవల వరకు. జగన్ తన ఐదేళ్ల కాలంలో రాజధాని అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా మూడు రాజధానుల నినాదం అందుకున్న విషయం తెలిసిందే.
రెండవసారి టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి పట్టాలు ఎక్కింది. కేంద్రంతో పాటు ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చిన అప్పులతో ఇప్పటికే వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. అయినా సరే ఇంకా రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి పరిష్కరించాల్సిన అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటిని తేల్చటానికే ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కమిటీ వేసింది. గురువారం నాడు స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా రాజధాని రైతులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎప్పుడూ సింగపూర్ తో పాటు ఇతర దేశాల పేర్లు చెప్పే చంద్రబాబు ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా అమరావతిని హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలంటే 28 గ్రామాల పరిధి సరిపోదు అంటూ వ్యాఖ్యానించారు. ఇలా అయితే అది ఒక మున్సిపాలిటీ గానే మిగిలిపోతుంది అన్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఇదే గ్రామాలతో ...ఇదే భూమితో ఫస్ట్ టర్మ్ లో సింగపూర్ తో పాటు ప్రపంచంలో పేరు గాంచిన నగరాల పేర్లు అన్ని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం హైదరాబాద్ లా అభివృద్ధి చెందాలంటే ఇంకా భూమి కావాలని చెపుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం తన మనసులో మాటను బయటపెట్టిన విషయం తెలిసిందే.
అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో పాటు స్పోర్ట్స్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రీస్ కోసం కలుపుకుని మొత్తం దగ్గర దగ్గర మరో 40 వేల ఎకరాలు సమీకరించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు 5000 ఎకరాలు...స్పోర్ట్స్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రీస్ కు అంటే ఒక్కో ప్రాజెక్ట్ కు 2500 ఎకరాల లెక్కన అవసరం అవుతాయి అని మంత్రి నారాయణ వెల్లడించిన సంగతి తెలిసిందే. గురువారం నాడు రైతులతో సమావేశం అయిన చంద్రబాబు ఒక వైపు రైతుల సమస్యలు అన్ని పరిష్కరిస్తానని, తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలి అన్నారు.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై తనకు అభిమానం, కృతజ్ఞత ఉంది అని తెలిపారు. రాబోయే మూడేళ్ళలో అమరావతిలో బిల్డింగులు అన్ని పూర్తవుతాయి అని, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అధికారులు, అంతా అమరావతి లోనే నివాసం ఉండి పని చేస్తారన్నారు. ఉద్యమ నేపథ్యంలో అనేక జేఏసీలు వచ్చాయి అని..ఇప్పుడు రైతులంతా కలిసి అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. అమరావతి రైతుల అభివృద్ధికి, భవిష్యత్తుకి తాను పూర్తి కమిట్మెంట్ తో ఉన్నాను...రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉంది అని తెలిపారు. తొలుత రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇంకా పూర్తి న్యాయం జరగనందున ఇప్పుడు కొత్తగా రాజధాని విస్తరణ కోసం భూములు ఇచ్చే విషయంలో కొంత మంది రైతులు సుముఖంగా లేరు అని టీడీపీ నేతలు కూడా చెపుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.



