జగన్ కు మినహాయింపు ఇవ్వొద్దు

కేసుల విచారణలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పించాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నందున కేసుల విచారణకు పదే పదే కోర్టులకు హాజరు కావాలంటే ఆయన విధులకు ఆటంకం కలుగుతుందని జగన్ తరపు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. జగన్ వేసిన పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో గత కొన్ని రోజులుగా వాదనలు సాగుతున్న విషయం తెలిసిందే. జగన్ తరపు న్యాయవాదులు ఇప్పటికే వారి వాదనను కోర్టు ముందు ఉంచగా..సోమవారం నాడు సీబీఐ హైకోర్టుకు తన అభ్యంతరాలను తెలిపింది.
గతంతో పోలిస్తే జగన్ హోదా పెరిగినందున ఆయన సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని..ఆయనకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ తన వైఖరిని తెలిపింది. గతంలో కూడా వ్యక్తిగత హాజరు మినహాయింపును సీబీఐ వ్యతిరేకించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పదేళ్ళు అయినా ఇంకా డిశ్చార్జి పిటీషన్ల దశలోనే ఉన్నాయన్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే కేసు విచారణలో మరింత జాప్యం జరుగుతుందన్నారు. సీబీఐ వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.