చంద్రబాబు..నారా లోకేష్ లపై బుచ్చయ్య చౌదరి గరం గరం
రాజీనామా యోచనలో సీనియర్ నేత
తెలుగుదేశంలో సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యవహారం కలకలం రేపుతోంది. సీనియర్ నేత అయిన తనలాంటి వారికి కూడా తండ్రీ, కొడుకులు అంటే చంద్రబాబు, నారా లోకేష్ లు ఫోన్ ఎత్తటం లేదని ఆయన వాపోతున్నారు. సీనియర్లకు పార్టీలో గౌరవం లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర నేతలు ఎవరూ చేయని రీతిలో అధికార వైసీపీపై ఆయన సోషల్ మీడియాలో పంచ్ లతో ఎటాక్ లు చేశారు. వాస్తవానికి బుచ్చయ్య చౌదరి ఎటాక్ కు పార్టీ శ్రేణుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది.
కొద్ది కాలంగా ఆయన మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఈ తరుణంలో గురువారం ఉదయమే బుచ్చయ్య చౌదరి టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. రాజీనామాపై ఆయన త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం. అధికారంలో ఉన్న సమయంలో కూడా తనకు సరైన గుర్తింపు లభించలేదని బుచ్చయ్య చౌదరి ఆగ్రహంతో ఉండేవారు. ప్రతిపక్షంలో కూడా ఆయనకు ఇదే పరిస్థితి ఉండటం విచిత్రం. మరి టీడీపీ ఈ వ్యవహారంపై స్పందిస్తుందా లేక వదిలేస్తుందో వేచిచూడాల్సిందే.