విశాఖ పెందుర్తిలో ఆరుగురు హత్య
విశాఖ జిల్లాలో గురువారం నాడు వరస దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని మధురవాడలో ఓ ఎన్ఆర్ఐ కుటుంబంలోని ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మరణించగా..జిల్లాలోని పెందుర్తిలో ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. రెండు కుటుంబాల మధ్య వివాదాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. పెందుర్తి మండలం జుత్తాడలో పాత కక్షలకు ఆరుగురు బలయ్యారు. స్థానికంగా ఉన్న రెండు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వారిని బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి అత్యంత దారుణంగా హతమార్చాడు.
చనిపోయిన వారిలో నలుగురు పెద్దలు ఉండగా, మూడేళ్ళ పాప, ఐదు నెలల పసికందు కూడా ఉండటం షాక్ కు గురిచేస్తోంది. ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన కారణాలు ఏమై ఉంటాయా అన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ హత్యలకు పాల్పడిన వ్యక్తే స్వయంగాం పెందుర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. ఈ హత్యల వార్త దావానంలా వ్యాపించటంతో జుత్తాడ ప్రజలు ఉలిక్కిపడ్డారు.