Telugu Gateway
Andhra Pradesh

అప్పులు పెరగటం సహజమే

అప్పులు పెరగటం సహజమే
X

ప్రజాశ్రేయస్సు కోసం రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నందున అప్పులు పెరగటం సహజమేనని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అప్పులు అభివృద్ధి కోసమే తప్ప..అవినీతి కోసం కాదన్నారు. చంద్రబాబు శాపనార్ధాలే తమకు దీవెనలు అన్నారు. బొత్స సత్యనారాయణ బుధవారం నాడు విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రజలు దారుణంగా తిరస్కరించినా కూడా ఆయనలో ఏ మాత్రం ప్రాయశ్చిత్తం కన్పించటంలేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అండ్‌ కో ఆధ్వర్యంలో జరుగుతున్న కుతంత్రాలు బట్టబయలవుతున్నా ఆయనలో కనీస పశ్చాత్తాపం అనేది కూడా లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు హయాంలో లోకేశ్‌కు మినహా ఎవరికి ఉద్యోగాలు కల్పించారని ప్రశ్నించారు. కమీషన్ల కోసం అమరావతిని, దోపిడీ నిమిత్తం పోలవరం ప్రాజెక్ట్‌ ను వాడుకున్నారని విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన.. పేదలకు ఏనాడైనా ఇళ్ల పట్టాలిచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసి, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే బాబుకు ఎందుకు అంత ఆక్రోశం అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సస్ చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేని చంద్రబాబు.. ట్రస్ట్‌ అంతర్గత విషయాల్లో తల దూర్చడం తగదన్నారు. ఆనంద గజపతి రాజు ట్రస్ట్‌ చైర్మన్ గా ఉండటం ఇష్టం లేని అశోక గజపతి రాజు మాన్సస్ రద్దు కోసం లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు బొత్స.

Next Story
Share it