బురదచల్లటమే చంద్రబాబు పని
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై బురద చల్లటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారన్నారు. మీడియా మైకులు కనిపిస్తే చాలు.. చంద్రబాబు రెచ్చిపోతారంటూ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ''మభ్య పెట్టడం, మోసం చేయడం చంద్రబాబుకు బాగా తెలుసు. చిత్తశుద్ధి, పని చేయాలనే తపన ఆయనలో లేదని'' అన్నారు. ఓటీఎస్ పై కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిర్మించలేదని..అప్పుడు ఆయన్ను ఎవరు అడ్డుకున్నారన్నారు. ఓటీఎస్ అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా స్పందించారు. ఈ పథకం వల్ల పేదలకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. సీఎం జగన్ చొరవతో ఇళ్ళ రుణాలు మాఫీ చేసి..ఇళ్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలిపారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వడ్డీ మాఫీ కోరినా చేయలేదన్నారు. ఓటీఎస్ ద్వారా ప్రభుత్వానికి వచ్చేది కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే అన్నారు. అయినా ఇది పూర్తిగా స్వచ్ఛందం అని..ఎవరినీ నిర్భందం చేయటంలేదన్నారు. ఓటీఎస్ పై విమర్శలు చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఓటీఎస్ పై దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతోపాటు ఉద్యోగుల అంశంపై కూడా సజ్జల స్పందించారు. వారిపై ప్రభుత్వానికి ప్రేమే ఉంటుంది తప్ప..ఎలాంటి కోపం ఉండదన్నారు. ఆర్ధిక వ్యవస్థపై భారం పడటం వల్ల ప్రభుత్వం కష్టాలు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే అని..వారు అనుకుంటే ఏమైనా చేయగలరని..అయితే తాము సంయమనం పాటించాల్సిందిగా కోరుతున్నామన్నారు.