Telugu Gateway
Andhra Pradesh

ఇది నిజమేనా?!...

ఇది నిజమేనా?!...
X

అసలు వాళ్ళ మాటలు చూస్తే భవిష్యత్తులో వీళ్ళు అసలు కలిసినా మాట్లాడుకుంటారా అనిపిస్తుంది. బయటినుంచి చూసేవాళ్లకు. అంతగా విమర్శించుకుంటారు. కానీ లోపల ఏమీ ఉండదు. మళ్ళీ ఎవరి అవసరాలకు అనుగుణంగా వాళ్ళు అలా పనిచేసుకుంటూ కలిసి పోతారు. గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో అదే సాగింది ప్రధాని మోడీ పై బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు ఎంత ఘాటు విమర్శలు చేశారో అందరూ చూశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదు..తమను ఏమి చేయలేరు అని చెప్పటం ఒకెత్తు...కానీ అలా కాకుండా మీ చేతిలోనే సిబిఐ, ఈడీ, ఐటి లు ఉన్నాయి కదా ఏమి పీక్కుంటారో పీక్కోండి అంటూ మాట్లాడారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మోడీ పై విమర్శల విషయంలో అటు కెసిఆర్, ఇటు కెటిఆర్ లు మొత్తం రివర్స్ గేర్ వేసినట్లు కనిపిస్తోంది. ఏదైనా మాట్లాడినా సంస్కారవంతమైన భాషలో మాట్లాడుతున్నారు. కేవలం లిక్కర్ స్కాం వల్లే ఈ మార్పు అని రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం సాగుతోంది. తెలంగాణ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా బీజేపీ అదే అట మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా తాజాగా అధికార వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇసుక స్కాం, లిక్కర్ స్కాం, ల్యాండ్ స్కాం, ఎడ్యుకేషన్ స్కాం అంటూ ఇంత అవినీతి ప్రభుత్వాన్ని తాను దేశంలో ఎక్కడ చూడలేదు అని ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా చేశారు అని...శాంతి భద్రతలు కూడా దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. నడ్డా విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని కూడా అంతే ఘాటుగా స్పందించారు.

మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో అవినీతిలో కూరుకుపోయి ఓడిపోయింది ఎవరు..బెంగళూరు లో జనం ఊసిన ప్రభుత్వం మీది కాదా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ స్కాం అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం చేసి ఆ భూమిపై కన్ను వేయటాన్ని స్కాం అంటారు అని ఎద్దేవా చేశారు. గతం లో అమరావతి పై విమర్శలు చేసి...ఇప్పుడు మళ్ళీ అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటూ మండి పడ్డారు. ఇరు వైపులా నుంచి వస్తున్న ఈ ఘాటు విమర్శలు ఎన్నికల వరకు ఉంటాయా లేక తెలంగాణ తరహాలోనే ఉత్తుత్తి విమర్శలుగా ఉంటాయా అన్నది వేచిచూడాలి. పైకి ఎంత తిట్టుకున్నా ప్రస్తుతానికి అయితే ఇరు పార్టీల విమర్శలను ప్రజలు పెద్దగా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో బీజేపీ కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది అని ప్రచారం బలంగా ఉంది. అయితే బీజేపీ చేరిక విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒక వేళ బీజేపీ ఎన్నికల కోసం టీడీపీ తో జట్టుకట్టిన కూడా వైసీపీ పెద్దగా స్పందించే ఛాన్స్ లేదు అని భావిస్తున్నారు. దీని వెనక రకరకాల కారణాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. చూడాలి మరి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల నాటికీ ఎన్ని వింతలు చోటు చేసుకొంటాయో.

Next Story
Share it