బద్వేలు అభ్యర్ధిని ప్రకటించిన బిజెపి
బద్వేలు ఉప ఎన్నిక జరగటం అనివార్యంగా కన్పిస్తోంది. తెలుగుదేశం పార్టీ, జనసేనలు ఇప్పటికే బరిలో ఉండబోమని ప్రకటించాయి. వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకం అని..తాము అభ్యర్ధిని బరిలో నిలుపుతామని ఏపీ బిజెపి ప్రెసిడెంట్ సోము వీర్రాజు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే అధిష్టానం ఆదేశంతో గురువారం నాడు అభ్యర్ధిని ప్రకటించారు. బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్‌ను బిజెపి అధిష్టానం ఎంపిక చేసింది.
దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించారు. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇటీవలే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 30న ఎన్నిక, నవంబర్ 2న కౌంటింగ్ జరగనున్నాయి. కాంగ్రెస్ కూడా బరిలో నిలుస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రధాన పార్టీ లేమీ లేకపోవటంతో ఎన్నిక నామమాత్రం కానుంది.