ఏపీలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం

ఆంధ్ర ప్రదేశ్ పక్క రాష్ట్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార టీడీపీ పై కూడా ప్రభావం చూపిస్తాయా?. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ పదోన్నతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరింత ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుందా?. ఇవే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. తమిళనాడు లో డీఎంకే తరపున స్టాలిన్ సీఎం గా ఉంటే...ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి గా ఉంటూ కీలక శాఖలు నిర్వహించారు. ఉదయనిధిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావటంతో పాటు పలు వివాదాస్పద ప్రకటనలతో పార్టీ ని ముంచారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరో కీలక విషయం ఏంటి అంటే పార్టీ అంటే అదేదో తమ ఫ్యామిలీ ఎఫైర్ గా మార్చారు అనే విమర్శలు డీఎంకే విషయంలో ఉన్నాయి. ఇది తమిళనాడు ప్రజలకు ఏ మాత్రం రుచించలేదు.
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇంచుమించు ఇప్పుడు అలాంటి వాతావరణమే ఉంది. నారా లోకేష్ ఉప ముఖ్యమంతి కాకపోయినా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన యాక్టింగ్ సీఎం గా వ్యవరిస్తున్నారు అనే అభిప్రాయం టీడీపీ నాయకుల్లోనే ఉంది. ప్రభుత్వంలోని కీలక శాఖల్లో ఆయన లేదా..ఆయన టీం సభ్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా కీలక ఫైల్స్ ఏవీ కూడా ముందుకు కదలవు అనే ప్రచారం పార్టీ వర్గాలతో పాటు అధికారుల్లో ఉన్న విషయం తెలిసిందే. అంతే కాదు...ప్రభుత్వంలో చాలా మంది తెరవెనక ఉంటూ పలు కీలక శాఖలో వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు అనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కొంత మంది సీనియర్ మంత్రులు నారా లోకేష్ వ్యవహారశైలి పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయినా కూడా చేసేది ఏమి లేక అలా బండి నడిపిస్తున్నారు అనే అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో ఉంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే వైసీపీ హయాంలో స్కాం లు చేసిన వాళ్ళతో ప్రభుత్వ పెద్దలు కొంతమంది సెటిల్మెంట్స్ చేసుకున్నారనే ఆరోపణలు టీడీపీ నాయకులు ..క్యాడర్ కు ఏ మాత్రం మింగుడుపడటం లేదు.
వైజాగ్ లో ల్యాండ్ స్కాం లతో పాటు పలు విషయాల్లో తెరవెనక లావాదేవీలే వాళ్లపై చర్యలు లేకపోవటానికి కారణంగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలే పార్టీ పరంగా నారా లోకేష్ కు పదోన్నతి కల్పించారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. తర్వాత అంటే ఎన్నికలకు కనీసం రెండేళ్ల ముందు నారా లోకేష్ ను సీఎం చేస్తారు అనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఎప్పటి నుంచో సాగుతోంది. ఈ విషయంలో చంద్రబాబు పై ఫ్యామిలీ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది అని కూడా పార్టీ నాయకులు చెపుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఆచితూచి అడుగులు వేస్తారా..లేక ఏమి అయితే అదే అవుతుంది అని అనుకున్న ప్రకారం ముందుకు వెళతారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు.
ముఖ్యంగా వైజాగ్ లాంటి ప్రాంతంలో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కార్పొరేట్ కంపెనీలు..రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించే విషయంలో నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు కారణం అవుతోంది. ఉద్యోగాలు ఇస్తే చాలు ఎకరాలకు ఎకరాలు తాము 99 పైసలకే కేటాయిస్తామని...ఇది తమ ప్రభుత్వ విధానం అని నారా లోకేష్ పదే పదే వ్యాఖ్యానించటం కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపించే అంశమే అని పార్టీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాల పేరు చెప్పి వందల కోట్ల విలువ చేసే భూములను దక్కించుకున్న కంపెనీలు తర్వాత కాలంలో అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయి అన్నది చెక్ చేసే మెకానిజం ప్రభుత్వంలో లేదు. ఆయా కంపెనీలు కాగితాలపై చెప్పే లెక్కలనే ప్రభుత్వం వల్లెవేస్తుంది తప్ప ...అసలు లెక్కలు ఎప్పటికి బయటకు రావు. పైగా భూములు దక్కించుకోవటం కోసం కంపెనీలు ఇలాంటి మోడల్ ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాయి కూడా.



