నరసరావుపేట ఎంపీ రాజీనామా
వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న మార్పులు..చేర్పులు ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. మంగళవారం నాడు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు పార్టీకి..ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి కొత్త అభ్యర్థిని దింపాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు ను సీఎం జగన్ పిలిచి మాట్లాడారు. గుంటూరు నుంచి పోటీ చేయమని కోరగా..తాను అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు అని చెప్పారు. ఈ విషయంలో జగన్ ఆలోచనలు..తన అభిప్రాయాలు బిన్నంగా ఉన్నాయని కొద్ది రోజుల క్రితం ఆయన వ్యాఖ్యానించారు.
గత కొన్ని రోజులుగా సాగుతున్న అనిశ్చితికి తెర దించుతూ వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. క్యాడర్ లో కన్ఫ్యూషన్ తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు. వాస్తవానికి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువ మంది వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీ అభ్యర్థిగా కృష్ణదేవ రాయలను కొనసాగించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన టీడీపీ లో చేరి తిరిగి ఇదే సీట్ లో బరిలో నిలిచే అవకాశం ఉంది అని చెపుతున్నారు.మార్పుల కారణంగా ఇప్పటికే కొంత మంది పార్టీ వీడగా మరికొంత మంది కూడా ఇదే బాటలో ఉన్నట్లు చెపుతున్నారు.