సంచయితకు షాక్..అశోక్ చేతికి మాన్సాస్ ట్రస్ట్
కీలక పరిణామం. ఏపీలో కొద్ది కాలం క్రితం హాట్ టాపిక్ గా మారిన మాన్సాస్ ట్రస్ట్ విషయంలో సోమవారం నాడు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం సంచయితను మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ గా నియమిస్తూ జారీ చేసిన జీవో 72 ను కొట్టేసింది. దీంతో తిరిగి ఈ ట్రస్ట్ వ్యవహారాలు అశోక్ గజపతిరాజు చేతికి రానున్నాయి. సంచయిత నియామకంపై అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు వెలువరించింది. సింహాచలం , మాన్సాస్ ట్రస్ట్ కు అశోక్ గజపతిరాజు చైర్మన్ గా ఉండేలా ఆదేశాలు జారీ చేసింది.
గతంలో మాన్సాస్ ట్రస్టీ, సింహాచలం దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే అశోక్ స్థానంలో సంచయితను నియమిస్తూ ప్రభుత్వం 72 జీవోను విడుదల చేసింది. ఈ అంశానికి సంబంధించి సంచయిత దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.